నాకు ఎందుకు బెయిల్ ఇవ్వరు మీరు..? సుప్రీంకోర్టును ఆశ్రయించిన డిస్మిస్డ్ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్

న్యూఢిల్లీ: డిస్మిస్డ్ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు ఫోర్జరీ  డాక్యుమెంట్స్ సమర్పించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‎ను తిరస్కరించడాన్ని పూజా ఖేడ్కర్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ.. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె పిటిషన్ దాఖలు  చేశారు. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ శర్మలతో కూడిన ధర్మాసనం 2025, జనవరి 15న పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‎ను విచారించనున్నట్లు తెలిసింది. 

అసలు పూజా ఖేడ్కర్ కేసు ఏంటంటే..?

మహారాష్ట్రకు చెందిన పూజా ఖేడ్కర్ యూపీఎస్సీ ద్వారా ఐఏఎస్ పోస్టుకు ఎంపికయ్యారు. ఇందులో భాగంగా.. పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పూజా ఖేడ్కర్ గురించి యూపీఎస్సీ ఆరా తీసింది. ఈ క్రమంలో యూపీఎస్సీ షాకింగ్ విషయాలు గుర్తించింది. ట్రైనింగ్ పీరియడ్‎లో అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా.. నకిలీ డాక్యుమెంట్స్ సమర్పించి ఐఏఎస్‎గా ఎంపికైనట్లు గర్తించింది యూపీఎస్సీ.

ALSO READ | 2024 ఎన్నికల్లో నిజంగా మోడీ ఓడిపోయారా..?: జుకర్ బర్గ్‎కు పార్లమెంటరీ కమిటీ నోటీసులు

ఫోర్జరీ పత్రాలు సమర్పించి యూపీఎస్సీని మోసం చేయడంతో పూజా ఖేడ్కర్‎పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అలాగే.. తప్పుడు పద్దతిలో జాబ్ పొందిన పూజా ఖేడ్కర్ ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని నియామక సంస్థ యూపీఎస్సీ రద్దు చేసింది. దీంతో పూజా ఖేడ్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నేను ఏ పత్రాలు ఫోర్జరీ చేయలేదని.. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటువేసే అధికారం లేదని.. తన అభ్యర్థిత్వాన్ని తిరిగి పునరుద్ధరించేలా యూపీఎస్సీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. అలాగే.. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరింది. 

పూజా ఖేడ్కర్ పిటిషన్‎పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో పాటు.. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ వ్యవస్థనే పూజా ఖేడ్కర్‌ తారుమారు చేయడానికి ప్రయత్నించారని.. ఇప్పుడు ఆమెకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తును సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయపడ్డ ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‎ను రిజెక్ట్ చేసింది. దీంతో పూజా ఖేడ్కర్ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు.