
- మల్లన్న సాగర్ ముంపు బాధితులను పట్టించుకోని గత సర్కార్
- మంచి ప్యాకేజీ ఇస్తమని
- హామీ ఇచ్చి ఏండ్ల పాటు పెండింగ్
- పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ నిర్వాసితుల ప్రదక్షిణలు
- కాంగ్రెస్ సర్కార్ పైనే ఆశలతో ఎదురుచూపులు
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : మల్లన్న సాగర్ రిజర్వాయర్ముంపు గ్రామాల నిర్వాసితులు గత సర్కార్ హామీలను నమ్మి కుటుంబాలతో రోడ్డుమీదకు వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి రిజర్వాయర్లోకి నీరు చేరినా నిర్వాసితులకు కన్నీరే మిగిలింది. గత సర్కార్ ఇచ్చిన హామీలు పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టడడం తో ఏండ్లుగా నిత్యం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దుస్థితి నెలకొంది. కలిసిన ప్రజాప్రతినిధులకు, అధికారుల కు తమ గోడు చెప్పుకుంటున్నా పరిష్కారం కావడంలేదు. చేసేదేమీలేక న్యాయం కోసం నిరసనలు తెలపడమే దిక్కైంది. నాలుగేండ్లుగా న్యాయమైన పరిహారం కోసం ఎదురుచూపులే మిగిలాయి. మరోవైపు గజ్వేల్ ఆర్అండ్ఆర్కాలనీలో కేటాయించిన ఇండ్లలో సౌలతులు సరిగా లేక తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు.
వందలమందికి పరిహారం పెండింగ్
మల్లన్నసాగర్ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామాలకు చెందిన సుమారు 300 మందికి ఇంకా పలు రకాలైన పరిహారం అందాల్సి ఉంది. ఒంటరి వృద్ధులకు ఇస్తామన్నా ప్యాకేజీ ఇవ్వలేదు. ముంపు గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది నిర్వాసితుల ప్యాకేజీలు పెండింగ్ పడ్డాయి. కొందరికి రూ. 7.5 లక్షల ప్యాకేజీ ఇచ్చినా.. ప్లాట్లు ఇవ్వలే దు. రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన పలువురు నిర్వాసితులకు స్ట్రక్చర్, ఖాళీ స్థలాలకు ఇంకా పరిహా రం అందలేదు. ఇలా నాలుగేండ్లుగా పెండింగ్ పరిహారం కష్టాలు పడుతున్నా బాధితుల గోడు వినే వారే లేరు.
చనిపోతే ఎక్కడ పూడ్చాలో తెలియక..
నిర్వాసిత గ్రామాల ప్రజలకు గజ్వేల్ లోని ఆర్అండ్ ఆర్ కాలనీ కేటాయించినా.. అక్కడ అన్ని మతాల ప్రజలకు సరైన బొందల గడ్డలు లేవు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా సమస్యను నుంచి బయటపడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. శవాలను బొందపెట్టాలంటే సీసీ రోడ్ల పక్కన, ఎక్కడైనా కాస్త ఖాళీ జాగా కనిపిస్తే.. రహస్యంగా తీసుకెళ్లి పూడ్చి పెడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల ఒకరు చనిపోతే డెడ్ బాడీతో గజ్వేల్ ఆర్డీవో వద్ద నిరసన తెలిపారు. మరోవైపు నిర్వాసితుల పిల్లలు చదువుకునేందుకు కాలనీలో సరైన పాఠశాల లేక మరింత ఇబ్బందిగా మారింది.
ప్రస్తుత సర్కార్ పైనే ఆశలు
నిర్వాసితులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందనే ఆశతో ఉన్నారు. గత సర్కార్ హామీలపై నమ్మించి మోసగించి తీరని అన్యాయం చేసిందని మండిపడుతున్నారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నిర్వాసితుల కష్టాలు ప్రస్తావించి, పరిష్కరిస్తాననే మాట ఇచ్చారు. అదేవిధం గా నిర్వాసితుల సమస్యల పై డీసీసీ ప్రెసిడెంట్తూంకుంట నర్సారెడ్డి పాదయాత్ర చేసి సీఎంను కలిసినప్పుడు వివరించారు. దీంతో ఆయన మాటలు కూడా నిర్వాసితుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేశాయి. రెండు నెలల్లో గజ్వేల్వచ్చి మలన్న సాగర్నిర్వాసితుల సమస్యలపై సమీక్ష నిర్వహించి పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయన తెలపడంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
తాత్కాలికంగా గజ్వేల్ లో డబుల్ ఇండ్లు ఇచ్చినా..
మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గజ్వేల్– -ప్రజ్ఞాపూర్మున్సిపల్ లోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇబ్బంది కలుగుతుంది. మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయించినప్పుడు పలు బాధిత కుటుంబాలకు గజ్వేల్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ల్లో తాత్కాలిక నివాసాలు కేటాయించారు. వీరిలో చాలా మందికి పరిహారం అందలేదు. ఇప్పటికీ డబుల్ ఇండ్లలోనే ఉంటున్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని పేదలకు డబుల్ ఇండ్లను కేటాయించినా నిర్వాసితులే ఉంటుండడంతో అవి శాశ్వితంగా దక్కే పరిస్థితి లేకుండా పోయింది.
పరిహారంపై హామీ ఇచ్చి రోడ్డున పడేసిండ్రు..
ఇండ్లు, భూములను కోల్పోయి ఊరు విడిచి రోడ్డున పడ్డాం. పరిహారంపై గత సర్కార్ ఎన్నో హామీలు ఇచ్చింది. ఏ ఒక్కటి ఇయ్యలేదు. నాకు ఇల్లు, ప్లాటు రాలేదు. పైసా పరిహారం అందలేదు. భార్యా ముగ్గురు ఆడపిల్లలతో రోడ్డున పడ్డం. ఏండ్లుగా అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. మా గోడును ఎవరూ పట్టించుకుంటలేదు. ఇప్పటికైనా సర్కార్ మాకు న్యాయం చేయాలి.
గూడూరి శంకరయ్య, నిర్వాసితుడు, పల్లెపహాడ్
నాలుగు నెలల్లో న్యాయం చేయాలని ఆదేశించినా పట్టించుకోలె
మా గోడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏండ్లుగా నిలువ నీడలేక ఇబ్బందులు పడుతున్నాం. అయినా మా సమస్యకు పరిష్కారం చూపడంలేదు. హైకోర్టులో మాకు అనుకూల తీర్పు వచ్చింది. నాలుగు నెలల్లో నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులేదు. పరిహారం కోసం న్యాయం జరిగే దాకా పోరాడుతూనే ఉంటాం.జయల
నర్సయ్య, నిర్వాసితుడు, ఏటిగడ్డ కిష్టాపూర్