
బడి, గుడి, బొడ్రాయికి నోచుకోని గ్రామాలు
సౌలతులు లేక ఇబ్బందులు పడుతున్న పునరావాస ప్రజలు
గద్వాల, వెలుగు: ఆర్‌అండ్‌ఆర్ సెంటర్లలో సౌలతులు లేక నిర్వాసిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న ఊర్లలో సర్వం కోల్పోయి ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ లకు వస్తే అక్కడ సరైన వసతులు లేకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ స్కీంలో గట్టు మండలంలోని చిన్నోనిపల్లి, ఆలూరు, ధరూర్ మండలంలోని ర్యాలంపాడు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కొన్ని ఏళ్ల క్రితమే ఆలూరులో ఆర్ అండ్ ఆర్ సెంటర్ ఏర్పాటుచేసినా అక్కడ ఇప్పటికీ సౌలతులు సరిగా లేవు.
ఇటీవల చిన్నోనిపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించి ఆర్ అండ్ ఆర్ సెంటర్ కు తరలించారు. ర్యాలంపాడు సెంటర్ లో సౌకర్యాలు లేకపోవడంతో అక్కడికి నిర్వాసితులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పనులు సాగక నిర్వాసితులు వెళ్లలేక కొన్ని ఏళ్ల నుంచి అక్కడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది ఆర్అండ్ఆర్ సెంటర్ కు వెళ్లలేక ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. చిన్నోనిపల్లి విలేజ్ లో మొత్తం 350 కుటుంబాలు ఉండగా ప్రస్తుతం అక్కడ 150 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. మిగతా వారంతా వేరే చోటికి వెళ్లి తల దాచుకుంటున్నారు.
గుడి, బడి, బొడ్రాయిలు లేవు
ఏ ఊరికైనా గుడి, బడి, బొడ్రాయి ఉంటాయి. ముంపునకు గురై ఊరు ఖాళీ చేసి వెళ్లిన కొత్త గ్రామాల్లో గుడి, బడి, బొడ్రాయి లేవు. గుడి లేకపోవటంతో ఏ శుభకార్యం చేయలేని పరిస్థితి నెలకొంది. బడి ని చిన్నపాటి షెడ్డులో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. ఒక గ్రామాన్ని ఖాళీ చేయించేటప్పుడు వారిని ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో పెట్టేముందు రోడ్స్, డ్రైనేజీ, కరెంటు, స్కూల్స్ బిల్డింగ్స్, వాటర్ సప్లై అన్ని రెడీ చేసి పంపించాలి. కానీ ఆర్ అండ్ ఆర్ సెంటర్లో కేవలం డ్రైనేజీ వేసి, కరెంటు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని నిర్వాసితులు వాపోతున్నారు.
షిఫ్టింగ్ చార్జీలు, పట్టా సర్టిఫికెట్లు ఇవ్వలే
రెవెన్యూ ఆఫీసర్లు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చిన్నోనిపల్లి నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఊరు ఖాళీ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామానికి చెందిన 44 మందికి షిఫ్టింగ్ చార్జీలు ఇవ్వలేదు. 350 మంది ఫ్యామిలీలలో 30 మంది చనిపోతే వారి వారసులకు ఇప్పటివరకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వలేదు.
ర్యాలంపాడు నిర్వాసితులకు అతీగతీ లేదు
ధరూర్ మండలంలోని ర్యాలంపాడు నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్లాట్లు పంపిణీ చేసినా ఇష్టానుసారంగా పంపిణీ చేయడంతో వాటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడికి ఇప్పటివరకు ఎవరు కూడా వెళ్లలేదు. చాలామంది వేరే ఊరికి షిఫ్ట్ కాగా కొందరు అదే ఊళ్లో కాలం వెల్లదీస్తున్నారు. అక్కడ సౌలతులు కల్పిస్తేనే ఊరిని ఖాళీ చేస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. గట్టు మండలంలోని ఆలూరు విలేజ్ కు చాలా రోజుల క్రితమే ఆర్ అండ్ ఆర్ సెంటర్ ఏర్పాటుచేసినా ఇప్పటికీ ఆ ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సౌలతులు కల్పించేందుకు కృషి
ఆర్ అండ్ ఆర్ సెంటర్లలో సౌలతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. చిన్నోనిపల్లి నిర్వాసితులకు త్వరలోనే పట్టాలు, షిఫ్టింగ్ చార్జెస్ ఇస్తాం. సీసీ రోడ్స్, స్కూల్ బిల్డింగ్స్ కంప్లీట్ చేసేందుకు కృషి చేస్తాం.
శ్రీనివాసరావు, ఇన్‌ఛార్జి ఆర్డీవో, గద్వాల.