- ఆదిలాబాద్, నిజామాబాద్ రీజియన్లకు 64 మంది ట్రాన్స్ఫర్
- రీజియన్ పరిధిలోని డిపోలకు మరో 64 మంది అడ్జస్ట్
- బదిలీలు రద్దు చేయాలంటున్న యూనియన్లు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం రీజియన్‌లో మిగులు ఉద్యోగుల పేరుతో 128 మంది ఆర్టీసీ డ్రైవర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం వివాదాస్పదంగా మారుతోంది. రీజియన్‌లో లాభసాటిగా నడుస్తున్న బస్సు షెడ్యూల్స్ తగ్గించి, సిబ్బంది సంఖ్యను ఎక్సెస్‌గా చూపిస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఏడాదిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 107 షెడ్యూల్స్ తగ్గించారని, ఖమ్మం రీజియన్‌లోని ఇతర డిపోల నుంచి ఏపీకి వెళ్లాల్సిన బస్సులను పూర్తిగా తగ్గించి ఇంటర్ స్టేట్ ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల నుంచి రీజియన్‌లో పని చేస్తున్న 64 మంది డ్రైవర్లను ఆదిలాబాద్, నిజామాబాద్ రీజియన్లకు డిప్యుటేషన్ పేరుతో బదిలీ చేశారని, మరో 64 మందిని ఖమ్మం రీజియన్ లోని ఇతర డిపోలకు అడ్జస్ట్ చేశారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఉన్న సిబ్బందిపై పని భారం పెంచుతున్న ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేస్తామని చెబుతున్నారు.
తగ్గిన షెడ్యూల్స్..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో -గతేడాది అక్టోబర్‌లో 601 షెడ్యూల్స్ ఉండగా, ప్రస్తుతం 494 షెడ్యూల్స్ మాత్రమే నడుస్తున్నాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. సిబ్బంది మిగులుగా తేలడానికి ఇదే కారణమని అంటున్నారు. ఎక్సెస్ స్టాఫ్ పేరుతో ఖమ్మం రీజియన్‌లో 15 ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్న 64 మంది డ్రైవర్లను ఆదిలాబాద్, నిజామాబాద్ రీజియన్లకు, మరో 64 మందిని రీజియన్ లోని ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి డిపోల నుంచి మధిర, భద్రాచలం డిపోలకు బదిలీ చేశారు. ప్రయాణికుల అవసరాల మేరకు బస్సులు పెంచాల్సి ఉండగా, తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం రీజియన్ కు ఆనుకొని ఏపీలో ఉన్న రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి సర్వీసులకు విపరీతమైన డిమాండ్ ఉన్నా, ఆ రాష్ట్ర ఆర్టీసీ నడుపుతున్న సర్వీసులకు సమాంతరంగా ఇక్కడ సర్వీసులు నడిపించడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత సర్వీసులు కూడా తగ్గించారని చెబుతున్నారు. అయితే ఆర్టీసీ ఆఫీసర్లు మాత్రం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇలా చేస్తున్నామని చెప్పడం గమనార్హం. ఇతర రీజియన్లలోనూ ఇలాంటి సర్దుబాట్లుఉంటాయని అంటున్నారు.
షెడ్యూల్స్ చాలా తగ్గించారు..
రీజియన్‌లో డిమాండ్ ఉన్న సర్వీసులను కూడా తగ్గిస్తున్నారు. ఇల్లందు, బోనకల్, కోదాడ, కొత్తగూడెం, విజయవాడ లాంటి ప్రాంతాలకు తగ్గించిన షెడ్యూల్స్‌ను మళ్లీ పెంచాలి. డ్రైవర్ల బదిలీని వెంటనే నిలిపేయాలి.
- జి. లింగమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్‌డబ్ల్యూఎఫ్
బదిలీలను ఆపకపోతే ఆందోళనలు
ఆర్టీసీ కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వక పోగా, పని భారం పెంచుతున్నారు. సిబ్బందిని కుదించి కండక్టర్ స్థానంలో టిమ్స్ పెట్టారు. సమస్యలపై ప్రశ్నించకుండా యూనియన్లు రద్దు చేశారు. కొత్త బస్సులు, ట్రిప్పులు, సిబ్బంది సంఖ్యపెంచకుండా ఉన్న వారిపై పని భారంపెంచారు. ఉన్న సిబ్బందిని మిగులుగా తేల్చి చేస్తున్న బదిలీలను ఆపకపోతే ఆందోళనలు తప్పవు.
- కల్యాణం వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి