- జడ్చర్ల మున్సిపాల్టీలో మూడేండ్లకే చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం
- కౌన్సిల్లో చైర్పర్సన్ భర్త జోక్యంతో విసిగెత్తిపోయిన సొంత పార్టీ కౌన్సిలర్లు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాల్టీలో మూడేండ్లుగా చైర్పర్సన్ లక్ష్మి, కౌన్సిలర్ల మధ్య వివాదం నడుస్తోంది. చైర్పర్సన్ భర్త దోరేపల్లి రవీందర్ మున్సిపల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే ఈ వివాదానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరగా చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు ప్రయత్నిస్తూ రాగా, బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణుగుతూ వచ్చింది. శనివారం నిర్వహించిన కౌన్సిల్ మీటింగ్‌లో చైర్ పర్సన్ తీరుపై నిరసన వ్యక్తం చేసిన సభ్యులు, ఆ తరువాత కలెక్టర్‌ను కలిసి అవిశ్వాసం పెట్టేందుకు వినతిపత్రం ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
మహబూబ్‌నగర్, వెలుగు : జడ్చర్ల మున్సిపాలిటీలో కొందరు సభ్యులపై చాలా రోజులుగా అవినీతి ఆరోపణలున్నాయి. ఈ మున్సిపాల్టీలో 27 వార్డులుండగా, 23 చోట్ల బీఆర్ఎస్, రెండేసి చోట్ల కాంగ్రెస్, బీజేపీ గెలిచాయి. ఇటీవల బీజేపీకి చెందిన కౌన్సిలర్ ఒకరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగా, కాంగ్రెస్ బలం మూడుకు చేరింది. అయితే కౌన్సిలర్ల బలం ఉన్న బీఆర్ఎస్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. కానీ, పీఠాన్ని చేజిక్కించుకున్న కొద్ది రోజులకే చైర్ పర్సన్‌పై సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ కౌన్సిలర్లే రెండేండ్లుగా నిరసన గళం వినిపిస్తున్నారు.
గతంలో కూడా తమ ప్లాట్లను కబ్జా చేశారని చైర్ పర్సన్ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. జడ్చర్లలో ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని, ఏండ్ల కింద కొన్న ప్లాట్లను కబ్జా చేస్తున్నారని పలు సందర్భాల్లో బాధితులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఓడిపోవడానికి జడ్చర్ల మున్సిపాల్టీలోని ఇష్యూలే కారణమనే టాక్ కూడా ఉంది.
కాగా, కొద్ది రోజుల కింద జడ్చర్లలో పందుల తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.1.25 కోట్లు విలువ చేసే పందులను చైర్పర్సన్ భర్త మాయం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు రాగా, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. అలాగే కౌన్సిలర్లు కూడా ఆయన వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్నారు. కౌన్సిల్ ఎజెండాను సభ్యులకు తెలియకుండా రూపొందించడం, ఇష్టారీతిన తీర్మానాలు చేయడంపై కొంత కాలంగా చైర్పర్సన్, కౌన్సిలర్ల మధ్య విభేదాలు ఉన్నాయి. దీనికితోడు అనుకూలంగా వారికి కాంట్రాక్టులు ఇవ్వడం, నిధులు ఇవ్వడం లాంటివి చేస్తుండడంతో విసిగిపోయిన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు శనివారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
టైం కోసం వెయిట్ చేసి..
చైర్పర్సన్ భర్త వ్యవహారం నచ్చక కౌన్సిలర్లు చాలా సందర్భాల్లో అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఏడాదిన్నర కింద ఈ విషయంపై అప్పటి ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డితో అవిశ్వాసంపై కౌన్సిలర్లు చర్చించారు. కానీ, ఎలక్షన్లు దగ్గర్లో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఆయన కౌన్సిలర్లకు సర్దిచెప్పి పంపించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే మళ్లీ చైర్‌పర్సన్‌తో పాటు వైస్‌చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు 21 మంది కౌన్సిలర్లు సమావేశమై చర్చించుకున్నారు.
ఈ విషయాన్ని లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకుపోగా, ఆయన కౌన్సిలర్ల నిర్ణయానికే వదిలేసినట్లు తెలిసింది. దీంతో టైం కోసం వెయిట్ చేసిన కౌన్సిలర్లు కౌన్సిల్ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా, జడ్చర్ల మున్సిపల్ వైస్‌చైర్మన్ పాలాది సారిక యూ టర్న్ తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు చైర్ పర్సన్‌తో కలిసి ఉన్న ఆమెపై కూడా కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే కౌన్సిలర్లతో కలిసి పోవడంతో చైర్ పర్సన్పైనే అవిశ్వాసం పెట్టారు.
ఇంకా రెండేండ్ల పదవీ కాలం..
జడ్చర్ల మున్సిపల్ పీఠాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. మూడేండ్ల పదవీ కాలం ముగియగా, ఇంకా రెండేండ్ల టైం ఉంది. అయితే ప్రస్తుతం అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం కావడంతో చైర్‌పర్సన్‌గా ఎవరు రేస్‌లో ఉన్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇదిలాఉంటే మెజార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారున్నప్పటికీ, చైర్పర్సన్ ఎన్నికలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సహకారం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆయన సమక్షంలో లక్కీ డిప్ తీసి చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకరించే అవకాశం ఉంటుందని అంటున్నారు.