ఇండ్లు కూల్చేందుకు వచ్చారనే భయంతో వరంగల్​ తహసీల్దార్​ అడ్డగింత

  • తాను బతుకమ్మ ఆట స్థలం పరిశీలనకు వచ్చానని చెప్పినా వినిపించుకోని జనం
  • వరంగల్​లోని ఎస్సార్​ నగర్ లో ఘటన
  • అధికారితో వాగ్వాదం.. గంటపాటు ఆందోళన 
  • పోలీస్ స్టేషన్​లో పలువురిపై ఫిర్యాదు

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్​లోని ఎస్సార్​నగర్  కాలనీలో బతుకమ్మ ఆట స్థలం పరిశీలనకు వచ్చిన తహసీల్దార్​ ఇక్బాల్​ను కాలనీవాసులు  మంగళవారం అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందుకు కదలకుండా అడ్డుగా నిల్చొని తమ ఇండ్లు కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. కొందరైతే ఏకంగా ఆయన కాళ్ల మీద పడి వేడుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న తహసీల్దార్.. తాను బతుకమ్మ ఆట స్థలం పరిశీలనకు వచ్చానని, తాము ఇండ్లను కూల్చబోవడం లేదని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు.

దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా, స్థానికంగా ఉన్న ఓ బీఆర్​ఎస్​ నేత ఇండ్లు కూల్చేందుకు వస్తున్నారంటూ చేసిన తప్పుడు ప్రచారం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు.  తహసీల్దార్​, ఏనుమాముల  పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఆదేశానుసారం తహసీల్దార్​ వరంగల్  ఎస్సార్ నగర్  14వ డివిజన్​లో బతుకమ్మ ఆడే స్థలాన్ని పరిశీలించేందుకు తన సిబ్బందితో కలిసి వచ్చారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి వాహనాన్ని ముందుకు కదలకుండా అడ్డగించారు. అందులో కొందరు కారు అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించారు. అసలు ఏంజరుగుతుందో తెలియక తహసీల్దార్​  కారు దిగడంతో కాలనీవాసులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.

మా ఇండ్లను కూలగొట్టేందుకే వచ్చారా.. అంటూ ప్రశ్నించారు. కాగా, తాను విధుల్లో భాగంగా ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాల మేరకు బతుకమ్మ ఆట స్థలాన్ని పరిశీలించేందుకు మాత్రమే వచ్చినట్లు ఇక్బాల్​ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అక్కడున్న వారిలో కొందరు అధికారిపై ఆగ్రహంతో ముందుకువెళ్లగా.. మరికొందరు మాత్రం తమ ఇండ్లజోలికి రావొద్దంటూ అధికారి కాళ్లు మొక్కుతూ బతిమిలాడారు. దీంతో దాదాపు గంట పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తహసీల్దార్​ తన సిబ్బందితో కలిసి సమీపంలోని ఏనుమాముల పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ విధులను అడ్డగించిన వారిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్:  వ‌రంగ‌ల్  అర్బన్  త‌హ‌సీల్దార్  ఇక్బాల్‌పై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ త‌హ‌సీల్దార్స్  అసోసియేషన్ (టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. రాములు, రమేశ్​పాక్  డిమాండ్  చేశారు. త‌హ‌సీల్దార్‌తో అనుచితంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేయాలని ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

బీఆర్​ఎస్​ నేత తప్పుడు ప్రచారం వల్లే..

ఉన్నతాధికారుల ఆదేశానుసారం విధుల్లో తమ సిబ్బందితో పాటు తన కారుపై దాడికి యత్నం చేశారని తహసీల్దార్​ ఇక్బాల్​ చెబుతుండగా.. హైదరాబాద్​లో మాదిరిగా ఎస్సార్ నగర్ లో సైతం ఇండ్లను కూల్చేందుకు తహసీల్దార్​ వచ్చాడనే సమాచారంతోనే తాము తహసీల్దార్​ కారును అడ్డగించామని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఆందోళనకు ఎస్సార్ నగర్ కు చెందిన బీఆర్ఎస్  నేత కేతిరి రాజశేఖర్​తో పాటు ఇద్దరు చేసిన తప్పుడు ప్రచారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.  అధికారులు, సిబ్బంది ఫిర్యాదు మేరకు కేతిరి రాజశేఖర్, కేతిరి లావణ్యపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏనుమాముల సీఐ రాఘవేందర్​ తెలిపారు.