వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక...రెండు వర్గాలుగా చీలిన బీఆర్ఎస్

  •     బీసీ వైపు భువనగిరి ఎమ్మెల్యే మొగ్గు 
  •     తమకే ఇవ్వాలంటూ ఓసీ లీడర్ల ఒత్తిడి

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక వివాదం బీఆర్​ఎస్​లో బీసీలు వర్సెస్​ ఓసీలుగా మారింది. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి బీసీల వైపు నిలబడగా, ఓసీలకే ఇవ్వాలని ఆ వర్గం లీడర్లు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వలిగొండ మార్కెట్​ కమిటీ చైర్మన్​పదవి జనరల్​మహిళగా ఉండటంతో బీసీ సామాజికవర్గానికి చెందిన కోనపురి కవితను ఎంపిక చేశారు. కాగా ఈసారి జనరల్​గా మారింది. భువనగిరి నియోజకవర్గంలో  రెండు మార్కెట్లు ఉండగా భువనగిరిలో జనరల్​ కేటగిరిలో ఎడ్ల రాజేందర్​రెడ్డికి చైర్మన్​గా అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలో జనరల్​ కేటగిరిలోనే ఉన్న వలిగొండ మార్కెట్​ చైర్మన్​బీసీలకు ఇవ్వాలనే విషయం తెరపైకి రావడంతో ఎంపికలో జాప్యం జరుగుతోంది.  గతంలో జనరల్​మహిళ అయినప్పటికీ బీసీ మహిళకు అవకాశమిచ్చారని, ఇప్పుడూ తమకు సపోర్టు చేయడంలేదని ఓసీలు ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిపై గుర్రుగా ఉంది. కాగా చైర్మన్​ పదవి కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన మొగుళ్ల శ్రీను, పైళ్ల రాజవర్ధనరెడ్డి, రమేశ్​రెడ్డి పోటీ పడుతున్నారు. మొగుళ్ల శ్రీనువైపు ఎమ్మెల్యే మొగ్గు చూపుతున్నట్లు చర్చ నడుస్తోంది. 

రెడ్డి నేతల భేటీ

ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వలిగొండకు చెందిన రెడ్డి లీడర్లు ఒక్కటయ్యారు. జనరల్​ కేటగిరిలో బీసీలను చైర్మన్​గా ఎంపిక చేయడమేంటన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. రెడ్డిల్లో ఎవరికి చైర్మన్​ పదవి ఇవ్వాలని ఆ సామాజిక వర్గానికి చెందిన సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు పైళ్ల శేఖర్​రెడ్డిని కలిశారు. గతంలో జనరల్​ మహిళ అయినప్పటికీ బీసీ మహిళకు అవకాశమిచ్చిన విషయాన్ని రెడ్డి లీడర్లు గుర్తు  చేశారు. ఈసారి రెడ్డిలకే చైర్మన్​ పదవి ఇవ్వాలని కోరారు. అయితే ఎమ్మెల్యే మాత్రం తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్​కు మార్కెట్​ చైర్మన్​ పదవి ఇస్తానని మాట ఇచ్చానని, తప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్​ లీడర్లు, ప్రజా ప్రతినిధులు ఇటీవల భువనగిరిలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. విషయాన్ని మం త్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని భావించి ఆయన అపాయింట్​మెంట్​ కోసం ప్రయత్నించి విఫలమైనట్టు తెలిసింది. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమ యంలో బీసీ, ఓసీలుగా పార్టీ కేడర్​చీలిపోవడంపై బీఆర్ఎస్​లీడర్లు ఆందోళన చెందుతున్నారు.