- = పార్టీ మారిన పది మందిపై వేటు వేయండి
- = ఏడుగురిపై రిట్ పిటిషన్, ముగ్గురిపై ఎస్ఎల్పీ
- = హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలైనా స్పీకర్ నిర్ణయం తీసుకోలే
ఢిల్లీ: బీఆర్ఎస్ తరఫున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలు పూర్తి అయినా ఇప్పటికీ స్పీకర్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించ లేదని బీఆర్ఎస్ పిటిషన్లలో పేర్కొంది.
ALSO READ | కేటీఆర్.. జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. ఖర్మ ఎవరినీ వదలదు
కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని తెలిపింది. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని గులాబీ పార్టీ కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ప్రస్తావించింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విషయంలో న్యాయవాదులతో చర్చించేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీకి వచ్చారు. ఆయన తెలిపిన వివరాల ఆధారంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.