చెల్పూర్​ కేటీపీపీలో నిలిచిన 750 మెగావాట్ల ఉత్పత్తి

చెల్పూర్​ కేటీపీపీలో  నిలిచిన 750 మెగావాట్ల ఉత్పత్తి

తడిసిన బొగ్గు నిల్వలు , గనుల నుంచి ఆగిన సరఫరా
కొనసాగుతున్న 350 మెగావాట్ల ప్రొడక్షన్​ 

రేగొండ, వెలుగు : కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జయశంకర్​భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్​లోని కేటీపీపీ (కాకతీయ థర్మల్ పవర్​ప్రాజెక్టు)లో సగానికిపైగా విద్యుత్​ ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలతో రెండు రోజుల కింద 600 మెగావాట్ల ప్లాంట్​ను షట్​డౌన్​ చేశారు. 500 మెగావాట్ల కెపాసిటీ ఉన్న ప్లాంట్​నుంచి కేవలం 350 వాట్ల కరెంట్ ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. వర్షాలతో జాతీయ రహదారిని అనుకుని ఉన్న కేటీపీపీ ప్రహరీ గోడ కూలడంతో వరద ప్లాంటులోకి చేరింది. 

నీళ్లు.. బొగ్గు యార్డుల్లోకి చేరడంతో బొగ్గంతా తడిసిపోయింది. వర్షాల కారణంగా 12 రోజుల నుంచి భూపాలపల్లి ఓసీపీ2, ఓసీపీ3, కేటీపీపీకీ చెందిన తాడిచర్ల ఓసీ నుంచి కూడా బొగ్గు రావడం లేదు. ఓసీల వద్ద డంపు చేసిన నిల్వలు కూడా అయిపోవడంతో కేటీపీపీలో కొరత  ఏర్పడింది. పవర్​ప్లాంట్​లోని కోల్​యార్డుల్లో 2 లక్షల మెట్రిక్​ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నప్పటకీ వర్షాలతో తేమశాతం పెరగడంతో విద్యుత్​ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది.