- అవకాశవాదులను దూరం పెట్టాలె
- రామగుండం బీఆర్ఎస్మీటింగ్లో కార్యకర్తలు, లీడర్ల ఫైర్
గోదావరిఖని, వెలుగు : బీఆర్ఎస్లో కష్టపడ్డవాళ్లకు గుర్తింపు లేదని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పలువురు కార్యకర్తలు వాపోయారు. పార్టీ కోసం కష్టపడి పని చేసినా ముఖ్యనేతలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిజ మైన కార్యకర్తలకు విలువ ఇవ్వాలన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఏరియాలో జరిగిన రామగుండం నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్పాల్గొన్నారు. పార్టీ అధికార ప్రతినిధులు తోడేటి శంకర్ గౌడ్, నడిపెల్లి మురళీధర్‌రావు మాట్లాడుతూ స్వచ్ఛందంగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కలేదన్నారు.
ఎమ్మెల్యేలకే జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి పార్టీ ఆఫీసులు కట్టినా పదేండ్ల నుంచి జిల్లా కమిటీలు వేయలేదన్నారు. కనీసం పార్టీ పదవులు కూడా ఇవ్వకపోవడంవల్ల చాలామంది నారాజ్ అయ్యారని చెప్పారు. కార్యకర్తలను కాపాడుకోవాలంటే పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలన్నారు. వెంకటేశ్ నేతను పిలిచి టికెట్ఇచ్చి పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకుంటే ఆయన మరో పార్టీలో చేరిపోయాడని, ఇలాంటి అవకాశవాదులను దూరం పెట్టాలన్నారు. వీరి మాటలకు కార్యకర్తలు విజిల్స్ వేస్తూ మద్దతు తెలిపారు. పార్టీ లీడర్లు, కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని కొప్పుల ఈశ్వర్, మధు, చందర్ అన్నారు. అంతకుముందు కేసీఆర్, కేటీఆర్పట్ల అనుచితంగా మాట్లాడారంటూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.