స్కూల్‌‌‌‌ యూనిఫామ్స్‌‌‌‌ రేటుపై.. టైలర్ల అసంతృప్తి

స్కూల్‌‌‌‌ యూనిఫామ్స్‌‌‌‌ రేటుపై..  టైలర్ల అసంతృప్తి

 

  • ఒక్కో జతకు రూ. 50 ఇస్తామన్న సర్కార్‌‌‌‌
  • రేటు చాలదంటున్న టైలర్లు 
  • యూనిఫామ్స్‌‌‌‌ బాధ్యత మహిళా సంఘాలకు..

భద్రాచలం, వెలుగు :  గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కుట్టుకూలీ విషయం ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. స్కూల్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తెలంగామ సమగ్ర శిక్షణ పేరిట రాష్ట్రంలోని 1 నుంచి ఇంటర్‌‌‌‌‌‌‌‌ వరకు చదువుతున్న స్టూడెంట్లకు ఈ ఏడాది రెండు జతల యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌ అందించనున్నారు. ఈ యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌ కుట్టే బాధ్యతను ఈ సారి మహిళా స్వయం  సహాయక సంఘాలకు అప్పగించారు. క్లాత్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వమే సప్లై చేస్తుండగా, కుట్టు కూలీగా ఒక్కో జతకు రూ.50 నిర్ణయించారు. కానీ ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే పిల్లల యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌కు గిరిజన సంక్షేమశాఖ రూ.100 ఇస్తోంది. దీంతో ఒకే పనికి ఇచ్చే డబ్బుల విషయంలో ఇంత తేడానా ? అని మహిళా సంఘాల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఐకేపీ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ బాధ్యత

మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా లోకల్‌‌‌‌‌‌‌‌ బాడీ, కేజీబీవీ, ఎయిడెడ్‌‌‌‌‌‌‌‌ తదితర స్కూళ్ల విద్యార్థులకు యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌ కుట్టించే బాధ్యతను జిల్లా స్థాయిలో ఐకేపీ స్టాఫ్‌‌‌‌‌‌‌‌కు కలెక్టర్లు అప్పగించారు. ఈ సంఘాలకు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టైం బాధ్యత అప్పగించడంతో మండలాల్లో ఎవరెవరి వద్ద మెషీన్లు ఉన్నాయి ? ఎవరు కుడతారు ? వంటి వివరాలు సేకరించి, వారితో మాట్లాడి కుట్టించే పని ఐకేపీ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ చూస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అన్ని పాఠశాలల్లో కలిపి 10,12,575 మంది బాయ్స్‌‌‌‌‌‌‌‌, 11, 06,864 మంది గర్ల్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. వీరికి రెండు జతల చొప్పున 42,38,878 డ్రెస్‌‌‌‌‌‌‌‌లు కుట్టాల్సి ఉంటుంది. ఇందుకు కుట్టు కూలీ కింద జతకు రూ.50 చొప్పున రూ.21,19,43,900 మహిళా సంఘాలకు ఇవ్వనున్నారు.

కూలీపై మహిళా సంఘాల అసంతృప్తి

యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌ కుట్టు కూలీ విషయంలో మహిళా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వారికి నచ్చజెప్పేందుకు ఐకేపీ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి జూన్‌‌‌‌‌‌‌‌ 1వ తేదీలోపే యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌ను స్కూళ్లకు చేరవేయాలి. కానీ డ్రెస్‌‌‌‌‌‌‌‌లు కుట్టే ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాలేదు. గతంలో క్లాత్‌‌‌‌‌‌‌‌ను హెచ్‌‌‌‌‌‌‌‌ఎంలకు పంపిస్తే వారు స్థానిక టైలర్లతో కుట్టించేవారు. ప్రభుత్వం ఇచ్చే రూ.50తో పాటు పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ కమిటీల ద్వారా మిగిలిన డబ్బును జమ చేసేవారు. ప్రస్తుతం యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌ కుట్టించే బాధ్యతను ఐకేపీ స్టాఫ్‌‌‌‌‌‌‌‌కు అప్పగించడంతో వారికి ఇబ్బందిగా మారింది. బయట ఒక్క జత యూనిఫామ్ కుట్టినందుకు పెద్దలకు రూ.400, చిన్న పిల్లలకు రూ.250 తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే ధరకు కుట్టేందుకు మహిళా సంఘాలు ముందుకు రావడం లేదు.

రేటు సరిపోదు 


ప్రభుత్వం ఇచ్చే రూ.50 రేటు సరిపోదు. ఐటీడీఏ జతకు రూ.100లు ఇస్తోంది. బల్క్‌‌‌‌గా కుట్టడం వల్ల ఐటీడీఏవే కాకుండా ఇతర స్కూళ్ల క్లాత్‌‌‌‌ కూడా గతంలో ఇచ్చే వారు. మేము రూ.50 రేటు పడదని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. శ్రమ తప్ప పైసా మిగలదు. అంతా నష్టమే.
- దాసు, గిరిజన సొసైటీ టైలర్​

అన్ని మండలాలకు పంపుతున్నం 

యూనిఫామ్స్‌‌‌‌కు సంబంధించిన క్లాత్‌‌‌‌ వచ్చింది. ఇప్పటికే 15 మండలాలకు పంపించాం. కొన్ని చోట్ల కుట్టుడు సైతం మొదలైంది. రేటు విషయంలో కొందరు తమకు పడదని చెబుతున్నారు. ప్రభుత్వ ఆర్డర్‌‌‌‌ కాబట్టి తప్పదు. ఉన్నతాధికారుల దృష్టిలో కూడా ఈ విషయం ఉంది.
- ఎం.రంగారావు, ఏపీడీ, డీఆర్డీఏ