మహబూబ్​నగర్​ జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి

మహబూబ్​నగర్​ జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి

మహబూబ్​నగర్​, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటా బయట అసంతృప్తి వ్యక్తమవుతోంది. మూడు నియోజవర్గాల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన లీడర్లు ‘హ్యాట్రిక్​’ కోసం ప్రయత్నిస్తున్నా,  ప్రజలు, సొంత పార్టీ కేడర్​ నుంచే వ్యతిరేకత వస్తోంది. ఉద్యమ లీడర్లు, పాత కేడర్​ను పక్కన పెట్టి కొత్త వారికి ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలున్నాయి. ఎన్నికల్లో పాలమూరుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, డబుల్​ బెడ్​రూం ఇండ్లు, దళితబంధు లాంటి స్కీములు బీఆర్ఎస్ ​లీడర్లు, వాళ్ల అనుచరులకే దక్కడం రూలింగ్​ పార్టీకి మైనస్​గా మారింది. అటు బీజేపీ, కాంగ్రెస్​లోనూ వర్గపోరు ఆ పార్టీల కేడర్​ను కలవరపెడ్తోంది. 

మంత్రి శ్రీనివాస్​గౌడ్​పై పలు ఆరోపణలు..

మహబూబ్​నగర్ నుంచి వి.శ్రీనివాస్​గౌడ్​ 2014 , 2018లో ఎమ్మెల్యేగా గెలుపొంది, 2018లో మంత్రి అయ్యారు. పాలమూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించినా.. సుందరీకరణ పనులు మినహా ఏవీ కంప్లీట్​ కాలేదు. అరకొరగాపూర్తయిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను అర్హులకు కాకుండా బీఆర్ఎస్​ లీడర్లు, వారి అనుచరులకు ఇచ్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లోనూ మంత్రిపై తరుచూ ఆరోపణలు వస్తున్నాయి. సెకండ్​ కేడర్​ లీడర్లను ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. బహిరంగంగా చెప్పకున్నా మండల నాయకల్లోనూ వ్యతిరేకత ఉంది.  ముందు నుంచీ పార్టీ కోసం, తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారిని పక్కకు పెట్టారనే టాక్​ వినిపిస్తోంది . కొద్ది రోజుల కింద జి.మధుసూదన్​రెడ్డి కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. చార్జ్​ తీసుకున్నాక ఆయన పాలమూరుకంటే సొంత నియోజకవర్గం దేవరకద్రపైనే ఫోకస్​ పెట్టడంతో మహబూబ్​నగర్​లో పార్టీకి  పెద్ద దిక్కు లేకుండా పోయారు. మహబూబ్​నగర్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి ఎవరు పోటీలో ఉంటారనేదానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. బీసీ లీడర్​ సంజీవ్​ ముదిరాజ్​ పోటీ చేసే అవకాశం ఉన్నా.. సామాజిక వర్గాల సమీకరణాల ప్రకారం ఈ సీటును మైనార్టీ వర్గాలకు ఇచ్చే చాన్స్​ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ఇటీవల చర్చ జరిగినా, ఆయన పార్లమెంట్​స్థానానికి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి కూడా ఈసారి పోటీలో ఉంటారనే టాక్ ఉన్నా.. ఆయన చాన్నాళ్లుగా జనాలకు దూరంగా ఉంటున్నారనే అపవాదు ఉంది. ఇటీవల పార్టీలో చేరిన బీసీ లీడర్​ ఎన్పీ వెంకటేశ్ కూడా టికెట్​పై ఆశలు పెట్టుకున్నారు. హైకమాండ్​ గ్రీన్​ సిగ్నల్​ఇస్తే పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. 

అభివృద్ధిలో వెనుకబడిన జడ్చర్ల.. 

జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం పాలమూరు బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సౌమ్యుడిగా పేరున్నప్పటికీ డెవలప్​మెంట్​లో జడ్చర్ల వెనుకబడిందనే టాక్ నడుస్తోంది. వంద పడకల హాస్పిటల్​ కట్టించి ఏడాదిన్నర కావస్తున్నా.. ఇంత వరకు ప్రారంభించలేదు. పీఆర్​ఎల్​ఐలో భాగమైన ఉదండాపూర్​ రిజర్వాయర్​ అసంపూర్తిగా ఉండడంతో పాటు బాధితులకు పరిహారం, ఆర్​అండ్​ఆర్​ ప్యాకేజీ విషయంలో అన్యాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన సెకండ్​ కేడర్​ లీడర్లను తప్ప, గ్రామ, మండల స్థాయి లీడర్లను పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీలోనే లక్ష్మారెడ్డికి  వ్యతిరేక వర్గం పని చేస్తోంది. పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి అన్న కొడుకు మన్నె జీవన్​రెడ్డి వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ టికెట్​ కోసం పట్టుబడుతున్నారనే టాక్​ ఉంది. ఇప్పటికే గ్రౌండ్​ వర్క్​ కూడా స్టార్ట్​ చేసినట్లు తెలిసింది. కొద్ది రోజుల కింద జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్​ఎస్​ పార్టీ తరఫున ఎవరు బరిలో ఉండాలనే దానిపై ఎగ్జిట్​ పోల్స్​ కూడా నిర్వహించడం విశేషం. దీనికి తోడు ఇటీవల జడ్చర్ల మున్సిపాలిటీకి చెందిన కొందరు బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు ప్లాట్లు, భూ కబ్జాలు చేస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగడం, ఇందులో ఎమ్మెల్యే అనుచరులే ఉన్నారని ప్రెస్​ మీట్​లో చెప్పడం దూమారం రేపింది. కాంగ్రెస్​ పార్టీ నుంచి టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ జనంపల్లి అనిరుధ్​రెడ్డి జడ్చర్ల నుంచి పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు డిసెంబర్​ 30న మ్యూజికల్ నైట్​, సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పరిశ్రమలు వదిలే కాలుష్యం, భూ బాధితులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ, బీసీ వర్గానికి చెందిన ఎర్ర శేఖర్​ బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరినప్పటి నుంచి కాంగ్రెస్​ రెండుగా చీలిపోయింది. వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ, బహిరంగంగానే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుండటంతో కేడర్​ నిరుత్సాహంలో ఉంది. బీజేపీ నుంచి బాలా త్రిపుర సుందరి పోటీ చేసేందుకు హైకమాండ్​ వద్ద పట్టుబడుతున్నారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. కానీ, సొంత పార్టీ లీడర్లే ఈమెను అడ్డుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా సపోర్ట్​ చేయకపోవడం ప్రతికూల అంశంగా మారింది. సొంతంగా కార్యక్రమాలను నిర్వహించినా తనకు ఎలాంటి పదవి లేదని చెప్పి కేడర్​ను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుండడం ప్రతికూలంగా మారింది.

అవినీతి అక్రమాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే అనుచరులు..

దేవరకద్ర నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి, మూడో సారి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు నుంచి ఉన్న వారిని కాకుండా.. ఒక సామాజిక వర్గానికి చెందిన లీడర్లకే ప్రయారిటీ ఇస్తున్నారనే టాక్​ ఉంది. ఇతర వర్గాలకు చెందిన సెకండ్​ లీడర్లు, పబ్లిక్​ ఏ పని కోసం వెళ్లినా.. ఆయన సపోర్ట్​ చేస్తున్న సామాజిక వర్గం లీడర్​ వద్దకే వెళ్లాలని సూచిస్తుండటంతో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నియోజకవర్గ కేంద్రానికి మంజూరు చేసిన డిగ్రీ కాలేజ్​ సూర్యపేట జిల్లాకు తరలిపోవడం విమర్శలు దారి తీసింది. పదేండ్లు కావస్తున్నా రైల్వే ఓవర్​ బ్రిడ్జి పూర్తి కాకపోవడం ప్రతికూల అంశంగా మారింది. ఊకచెట్టువాగు పొంటి నియోజకవర్గంలో దాదాపు 22 వరకు చెక్​ డ్యామ్​లు నిర్మించినా, వీటి పరిధిలో బీఆర్​ఎస్​ లీడర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా అక్రమ మైనింగ్​, మట్టి మాఫియాలో బీఆర్​ఎస్​ లీడర్లు కీ రోల్ పోషిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. అలాగే ఈసారి బీఆర్​ఎస్​ నుంచి దేవరకద్ర అసెంబ్లీ టికెట్​కోసం మహబూబ్​నగర్​ డీఎస్పీగా పని చేసిన కిషన్​ గౌడ్​ ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ ఉంది. నాలుగు నెలలుగా ఈయన అడ్డాకుల, మూసాపేట, కొత్తకోట, మదనాపురం, దేవరకద్ర మండలాల్లో తయన అనుచరులతో గ్రౌండ్​ వర్క్​ స్టార్ట్​ చేశారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి పాలమూరు డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్​రెడ్డి పోటీ చేస్తారనే టాక్​ ఉన్నా.. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్​రెడ్డి, సీతమ్మ దంపతుల్లో ఒకరు పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. బీజేపీ నుంచి నిరుడు ఎన్నికల్లో పోటీ చేసిన డోకూరు పవన్​కుమార్​రెడ్డి పోటీకి రెడీ అవుతున్నారు. సానుభూతితో పాటు ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈయనతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎగ్గని నర్సింహులు సామాజిక వర్గాల ఈక్వేషన్స్​ తెరమీదకు వస్తే తనకు టికెట్​ వస్తుందనే ఆశతో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కూడా సొంతంగా పర్యటనలు చేస్తూ, ప్రజలకు టచ్​లో ఉన్నారు.

2018లో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు

మహబూబ్​నగర్​  

వి.శ్రీనివాస్​గౌడ్​ (బీఆర్​ఎస్​)    86,474
మరాఠి చంద్రశేఖర్ (టీడీపీ)    28,699
సయ్యద్​ ఇబ్రహీం (బీఎస్పీ)    21,664

దేవరకద్ర​ నియోజకవర్గం

ఆల వెంకటేశ్వర్​రెడ్డి​ (బీఆర్​ఎస్​)    96,130
డోకూర్​ పవన్​ కుమార్​రెడ్డి (కాంగ్రెస్​)    60,882
ఎ.వెంకటేశ్వర్​రెడ్డి (సమాజ్​వాది)    5,937

జడ్చర్ల నియోజకవర్గం

సి.లక్ష్మారెడ్డి (బీఆర్​ఎస్​)    94,598
మల్లు రవి (కాంగ్రెస్​)    49,516
మధుసూదన్​ (బీజేపీ)    3,601

మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్​గౌడ్​

అనుకూల అంశాలు

  •     అపోజిషన్​ బలహీనంగా ఉండటం..
  •     ప్రభుత్వ స్కీంలను ఇంప్లిమెంట్​ చేయడం..
  •     పబ్లిక్​లో ఎక్కువగా ఉండటం..

ప్రతికూల​ అంశాలు

  •     కేడర్​లో తీవ్ర అసంతృప్తి.. నియంతృత్వ వైఖరి ..
  •     కొత్త పరిశ్రమలు, ఐటీ పార్క్​ రాకపోవడం..
  •     అనుచరులు భూ దందాలు, ఆక్రమణలు చేస్తున్నారనే ఆరోపణలు

 

జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి  అనుకూల అంశాలు

  •     మంచి ప్రజాసంబంధాలు కలిగి ఉండడం 
  •     ప్రభుత్వ స్కీంలు ఇంప్లిమెంట్​చేయడం 
  •     సెకండ్​ కేడర్​ లీడర్ల అండ  

ప్రతికూల​ అంశాలు

  •     సొంత పార్టీలో వర్గపోరు..
  •     బీఆర్ఎస్​ లీడర్ల భూ కబ్జాలు, ఇల్లీగల్​ దందాలు, ప్లాట్ల ఆక్రమణలు 
  •    క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సంబంధాలు లేకపోవడం.. 

దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి అనుకూల అంశాలు

  •     ప్రభుత్వపథకాలను అమలు చేయడం ..
  •     వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా  గెలుపొందడం..
  •     అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం..

ప్రతికూల​ అంశాలు

  •     నియోజకవర్గంలో పేదలకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు ఇవ్వలేదన్న విమర్శలు  ..
  •     ఒకే వర్గానికి చెందిన కేడర్​ను ప్రోత్సహిస్తుండంతో  మిగిలిన వాళ్లతో నెలకొన్న తీవ్ర అసంతృప్తి..
  •     సీఎం కేసీఆర్ ​నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. 
  •     ఇసుక, మట్టి, మైనింగ్​ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలు

జిల్లా ఓటర్ల వివరాలు


నియోజకవర్గం        పురుషులు    మహిళలు    ఇతరులు    మొత్తం
మహబూబ్​నగర్    1,15,028          1,14,724           08             2,29,769
దేవరకద్ర               1,07,269          1,07,951           00             2,15,220
జడ్చర్ల                    1,02,076          1,00,326           02             2,02,404
మొత్తం                   3, 24, 373         3, 23,001         10             6,47,393