బీఆర్ఎస్​లో అసంతృప్తులు ఒక్కటైతున్నరు

యాదాద్రి, వెలుగు:  ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలంతా ఒక్కటైతున్నరు. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ లీడర్​ అందరినీ ఒకే వేదికపైకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని రోజులుగా ఆ లీడర్​ నేతృత్వంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు లీడర్లు సీక్రెట్​గా కలుసుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు నుంచి ఉమ్మడి నల్గొండకు చెందిన  వివిధ పార్టీల లీడర్లు బీఆర్ఎస్ లో  చేరారు. వారితో పాటు కోమటిరెడ్డి సోదరులను వ్యతిరేకించేవారు బీఆర్​ఎస్​కు తోడు కావడంతో ఆ ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి గెలిచారు.

ఆ ఎన్నిక ముగిసిన తర్వాత మునుగోడులో బీఆర్​ఎస్​ గెలుపు కోసం పని చేసిన వారితో పాటు గతంలో క్రియాశీలకంగా వ్యవహరించిన లీడర్లనూ బీఆర్ఎస్​ అధిష్ఠానం పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్​సిట్టింగులకే మళ్లీ ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడంతో.. స్థానికంగా తమకు పోటీ అవుతారని అనుకున్న లీడర్లను ఎమ్మెల్యేలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఓ వైపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదన్న బాధ.. మరో వైపు ప్రస్తుత ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్​లో క్రియాశీలకంగా పనిచేస్తున్నవారు, ఈ ఏడాది కొత్తగా పార్టీలో చేరిన వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : పూర్తిగాని ప్రాజెక్టును ప్రారంభించుడేంది?... సీఎం కేసీఆర్​పై షర్మిల ఫైర్

ఇయ్యాల అందరూ ఒకే వేదికపైకి

ఇప్పటి వరకు సీక్రెట్​గా కలుసుకున్న అసంతృప్త నేతలంతా తొలిసారి ఒకే వేదికపైకి రానున్నారు. ఆదివారం నల్గొండలో మీటింగ్​ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తమకు ప్రయారటీ ఇవ్వాలని ఈ వేదిక మీద నుంచి డిమాండ్​ చేస్తారని సమాచారం. ఈ మీటింగ్​కు ఉమ్మడి జిల్లాకు చెందిన లీడర్లతో పాటు 40 నుంచి 50 మంది వేరే జిల్లాల లీడర్లు కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, మీటింగ్​ నిర్వహించే ప్లేస్ ను​మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. అలాగే, ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కువగా ఈ మీటింగ్​కు రాబోతున్నారని తెలుస్తోంది.