కలిసికట్టుగా పనిచేస్తాం .. నర్సాపూర్​ కాంగ్రెస్​లో  సద్దుమణిగిన అసమ్మతి

కలిసికట్టుగా పనిచేస్తాం .. నర్సాపూర్​ కాంగ్రెస్​లో  సద్దుమణిగిన అసమ్మతి

నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్​లో అసమ్మతి సద్దుమణిగింది. అందరం కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్​ నర్సాపూర్​ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని గెలిపిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్​ కుమార్, అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, సీనియర్​ నాయకుడు సోమన్నగారి రవిందర్​రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్​ పార్టీ టికెట్​ ఆశించి భంగపడ్డ అనిల్​ కుమార్ పోటీలో ఉంటానంటూ నామినేషన్​ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  ఆంజనేయులు, రవీందర్​ రెడ్డి తదితరులు ఆయనకు మద్దతుగా నిలిచారు.

ఈ క్రమంలో శనివారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్​ రావు ఠాక్రే.. అనిల్​కుమార్, ఆంజనేయులు, రవిందర్​రెడ్డి లను పిలిపించి మాట్లాడి నచ్చజెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయమని, తప్పకుండా తగిన గుర్తింపు ఇస్తామని హామీ​ ఇచ్చారు. ఈ మేరకు అనిల్​ కుమార్​ సమ్మతించి  పార్టీ అభ్యర్థి రాజిరెడ్డి గెలుపు కోసం సమష్టిగా పనిచేస్తామని ప్రకటించారు. నర్సాపూర్​లోని కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​లో రాజిరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఇదే విషయాన్ని వెల్లడించారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు సుజాత సత్యం, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, కర్ణాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక 

బీఆర్ఎస్​కు చెందిన శివ్వంపేట మాజీ సర్పంచ్ స్రవంతి నవీన్ గుప్తా తన అనుచరులతో కలిసి కాంగ్రెస్​ నేత మాణిక్​రావు ఠాక్రే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హత్నూర మండలం సిరిపుర గ్రామానికి  చెందిన ఎంపీసీటీ లక్ష్మి భీంల నాయక్, మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి, సావిత్రమ్మ, సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి గారి రామ్ రెడ్డి, బుచ్చిరెడ్డి భూపాల్ రెడ్డి, ముగ్గురు వార్డు మెంబర్లు, 100 మంది కార్యకర్తలు బీఆర్​ఎస్​ను వీడి ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ.హకీమ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కిష్టయ్య, దౌల్తాబాద్ సర్పంచ్ వెంకటేశం, గుండ్ల మాచనుర్ సర్పంచ్ జయంతి శశిధర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు రియాజ్ అలీ, నర్సింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భిక్షపతి గౌడ్, అసిఫ్ హుస్సేన్, శ్రీనివాస్, హాజీ పాల్గొన్నారు.