- టార్గెట్చేస్తున్న ఎమ్మెల్యేలు, వారి అనుచరులు
- నయానో, భయానో దారిలోకి తెచ్చుకునే యత్నం
- సూర్యాపేటలో వట్టే జానయ్య ఎపిసోడ్‌పై మంత్రి సీరియస్
- భూకబ్జాలు చేస్తే తొక్కిపట్టి నార తీస్తానని కామెంట్
నల్గొండ, వెలుగు : బీఆర్‌ఎస్‌లోని అసమ్మతి నేతలను ఎమ్మెల్యేలు, వారి అనుచరులు టార్గెట్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆచీతూచీ అడుగులేసిన నేతలు వ్యతిరేకత పెరుగుతుండడంతో కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు. డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ఎపిసోడ్పై మంత్రి జగదీశ్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. మంత్రి అండతోనే జానయ్య భూకబ్జాలు వెలుగులోకి రాలేవని, ఆయనకు ప్రాణహానీ ఉందని తెలిసే ప్రభుత్వం గన్మెన్లను కేటాయించిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. జానయ్య వ్యవహారం ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారుతుండడంతో ‘రౌడీ యిజం, భూకబ్జాలు చేస్తూ ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, తొక్కి పట్టి నార తీస్తా’ అని మంత్రి కామెంట్ చేశారు. అంతేకాదు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులకే బీఆర్‌ఎస్‌లో చోటు ఉంటుందని, ఓట్ల కోసం భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
మంత్రి బాటలోనే ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు కూడా మంత్రి బాటలోనే నడుస్తున్నారు. నాగార్జునసాగర్‌లో కొద్దిరోజులుగా ఎమ్మెల్యే భగత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం పార్టీకి చెడ్డ పేరు తెస్తోంది. ఈ విషయంలో మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న భగత్ వర్గం ఎదురు దాడి మొదలుపెట్టింది. ఆదివారం హాలియాలో ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ యాదవ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. భగత్‌ను వ్యతిరేకించడం వెనక కుట్ర దాగివుందని, ప్రతిపక్ష పార్టీల హస్తం కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు భగత్‌కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. అయినా వినకుండా సోమవారం గుర్రంపోడు మండల ప్రజాప్రతినిధులు సమావేశమై భగత్‌ను ఎన్నికల్లో ఓడగొట్టి, సొంత నియోజకవర్గం నకిరేకల్‌కు సాగనంపుతామని హెచ్చరించారు.
కోదాడలో..
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా తనకు మేకులా తయారైన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, కన్మంత శశిధర్ రెడ్డిలకు గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని డిసైడయ్యారు. బీఆర్‌ఎస్‌లో టికెట్ రాకుంటే శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన భార్య పద్మావతి హుజూర్నగర్, కోదాడలో పోటీ చేస్తామని ప్రకటించడంతో శశిధర్ రెడ్డి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో చందర్రావు, శశి ధర్ రెడ్డి వర్గాలు కలిసికట్టుగా మల్లయ్యను టార్గెట్ చేశారు. కాగా, వీరు 2018 ఎన్నికల్లో కోవర్టులుగా పనిచేశారని, తెరవెనక కాంగ్రెస్ అభ్యర్థికి సాయపడ్డారని మల్లయ్య వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంతోనే స్వల్ప ఓట్లతో గట్టెక్కాల్సి వచ్చిందని అంటున్నారు. ఆరోపణలు మానుకోకపోతే అసమ్మతి నేతల బండారం బయట పెడ్తామని హెచ్చరిస్తున్నారు.
టార్గెట్.. వీరేశం
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేములు వీరేశంను రాజకీయంగా దెబ్బ కొట్టేం దుకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గం, కాంగ్రెస్‌లో ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వీరేశం కాంగ్రెస్‌లో చేరితే ప్రమాదమని ఉందని భయపడుతున్న ఆపార్టీ లీడర్లు బీఆర్‌ఎస్‌తో కలిసి హైడ్రామా నడిపిస్తున్నారు. వీరేశంను కాంగ్రెస్‌లో చేర్చుకోకుండా ఆ పార్టీ ముఖ్య నేతలతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లీడర్లు కలిసి లాబీయింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వర్గం కూడా వీరేశం రాకను ససేమిరా ఒప్పుకో వడం లేదు. దీంతోనే నార్కట్‌పల్లి మండలం బ్రహ్మణ వెల్లంలలో పెట్టిన మీటింగ్‌లో ఏకాభిప్రాయం కుదరక వెంకట్ రెడ్డి సభను వాయిదా వేశారు.
అసమ్మతి వర్గం సైలెంట్
దేవరకొండలో మండలాల వారీగా మీటింగులు పెట్టి ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌పై దుమ్మెత్తిపోసిన మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, దేవేంద్ర నాయక్ తదితరులు సైలెంట్ అయ్యారు. తెరవెనక ఏం జరిగిందో తెలియకపోయినా హైకమాండ్ సీరియస్‌గానే యాక్షన్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నల్గొండలో పిల్లి రామారాజు యాదవ్ సైతం తన ప్రచారాన్ని స్లో చేశారు. ఇంటిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. మునుగోడు వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా స్థానిక ప్రజాప్రతినిధుల్లో కొందరు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపు చూస్తున్నారు. ఇక్కడ లోకల్ లీడర్లను దారిలోకి తెచ్చుకునేందుకు సామ, ధాన, భేద దండోపాయాలకు ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు.