
- సీఎం ఇలాకాలో మరోసారి సమావేశమైన బీఆర్ఎస్ అసంతృప్త నాయకులు
- భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : సీఎం ఇలాకాలో బీఆర్ఎస్అసంతృప్తుల వరుస మీటింగ్‌లతో సమీకరణాలు మారనున్నాయి. బీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలు బుధవారం మరోసారి సమావేశమయ్యారు. గజ్వేల్ కేంద్రంగా ప్రత్యేక సమావేశం నిర్వహించి తమ భవిష్యత్ ప్రణాళికకు రూపకల్పన చేసుకున్నారు. నియోజకవర్గంలోని కొండపాక, కుకునూరుపల్లి తప్ప మిగతా మండలాల నుంచి దాదాపు 200 మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల వేళ పార్టీ ముఖ్య నేతలు బుజ్జగిస్తారని భావించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ లేకపోవడంతో ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పట్టించుకోని పార్టీ హైకమాండ్
బీఆర్ఎస్ అసంతృప్తులను పార్టీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. గతంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నించగా మంత్రి హరీశ్ రావు అడ్డుకున్నారు. సముచిత స్థానం లభిస్తుందనే హామీ ఇవ్వడంతో వారు వెనక్కితగ్గారు. కానీ ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఆశించిన మేర ఆదరణ దక్కకపోవడంతో కొంత కాలంగా వరుసగా అసంతృప్తులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల బీసీ నినాదంతో బీఆర్ఎస్ అసంతృప్త నేతలు మండలాల వారీగా మీటింగ్‌లు పెట్టుకోగా వారిపై పార్టీ నేతలు ఎదురుదాడికి దిగడం గమనార్హం.
‘కారు’ దిగి ‘కమలం’ వైపు..
గజ్వేల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి ఆదరణ కరువైన నేతలు కారు దిగి కమలం వైపు వెళ్లేందుకు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి నిలబెడితే అతడి గెలుపు కోసం పనిచేయాలని వారు భావిస్తున్నా మరిన్ని రోజులు వేచిచూద్దామనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గజ్వేల్ లో బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతుండటంతో ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఇద్దరు ముఖ్య బీసీ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మూడు రోజుల కింద దుద్దెడలో సమావేశమైన బీఆర్ఎస్ అసంతృప్త నేతల్లో ఐక్యత కొరవడినట్టు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో కొందరు ఏంచేయాలని తర్జన భర్జన పడుతుంటే.. మరికొందరు లీడర్లు మాత్రం కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
రేపు శామీర్‌పేటలో బీఆర్ఎస్ లీడర్ల సమావేశం..
గజ్వేల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని ఒక ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని నిర్వహించనున్నారు. దాదాపు ఎనిమిది వేల మందితో నిర్వహించే ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశాలున్నాయి. సమావేశంలో గజ్వేల్ ఎన్నిక కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం కేసీఆర్ సమావేశానికి హాజరుకాకుంటే ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.