దశాబ్ది ఉత్సవాలకు.. బీఆర్ఎస్ అసమ్మతి లీడర్లు దూరం

నల్గొండ, వెలుగు  ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు బీఆర్ఎస్​ అసమ్మతి లీడర్లు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేల వైఖరిపై నారాజ్​గా ఉన్న వారంతా తమ నిరసన తెలియజేసేందుకు వేడుకలను అవకాశంగా తీసుకున్నారు. నల్గొండ, మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్, కోదాడ, నకిరేకల్, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలలో అసంతృప్తులు వేడుకలవైపు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. అసంతృప్తుల విషయంలో ఎమ్మెల్యేలు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన సీనియర్లను కూడా ఎమ్మెల్యేలు వేడుకలకు పిలవడం లేదన్న విమర్శలుఉన్నాయి. కొంతమంది లీడర్లు ఎమ్మెల్యేల వ్యవహారి శైలి గురించి ఇప్పటికే హైకమాండ్​కు ఫిర్యాదు చేశారు. 

ఇక్కడే ఎక్కువ..

   నల్గొండలో పిల్లి రామరాజు యాదవ్​, మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి ప్రధాన అనుచరుడు తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, నల్గొండ టౌన్​లో పలువురు కౌన్సిలర్లు వేడుకులకు దూరంగా ఉంటున్నారు.   

దేవరకొండ నియోజకవర్గంలో సైతం చైర్మన్​ గుత్తా వర్గం వేడుకులను బహిష్కరించినట్లు తెలుస్తోంది.  ఎమ్మెల్యే రవీంద్రకుమార్​ మీదున్న కోపంతో మున్సిపల్​ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వడ్త్యా దేవేందర్​ నాయక్​, డిండి జడ్పీటీసీ దేవేందర్​రావు, పీఏపల్లి, కొండమల్లేపల్లి, చింతపల్లి, చందంపేట మండలాల కు చెందిన పలువురు జడ్పీటీసీలు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.  

నాగార్జునసాగర్​లో ఎమ్మెల్సీ కోటిరెడ్డితోపాటు ఆయన వర్గీయులు ఎమ్మెల్యే భగత్​తో కలిసి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం లేదు. తిరుమలగిరి సాగర్​, గుర్రంపోడు జడ్పీటీసీలు, హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో పలువురు కౌన్సిలర్లు ఉత్సవాలకు దూరంగా ఉంటున్నారు. 

మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి వైఖరి పై స్థానిక ప్రజాప్రతినిధుల్లో నిరసన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చౌటుప్పుల్​ మున్సిపల్​ చైర్మన్​, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడు, సంస్థాన్​ నారా యాణ్​ పూర్​ మండలాల్లోని పలువురు జడ్పీటీసీ, ఎంపీపీలు దశాబ్ది వేడుకల్లో పాల్గొనడం లేదు. శుక్రవారం మునుగోడులో జరిగిన నియోజకవర్గ కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చౌటుప్పుల్​ మున్సిపల్​ చైర్మన్​ వెన్​రెడ్డి రాజుతో సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనకుండా నిరసన తెలిపారు. 

నకిరేకల్​ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గం వేడుకలకు దూరంగా ఉంది. శుక్రవారం నకిరేకల్​ స్టేడియం లో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఇద్దరు మంత్రులు పాల్గొన్నారు.. కానీ వీరేశంతోపాటు ఆయన వర్గీయులు ఎక్కడా కనిపించ లేదు. మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, బీసీ కార్పొరేషన్​ మాజీ చైర్మన్​ పూజర్ల శంభయ్య లాంటి లీడర్లకు ఆహ్వానం కూడా అందలేదని సమాచారం. 

కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్​ను బాహాటంగానే వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్​రావు, యెర్నేని వెంకటరత్నం బాబు, కన్మంత శశిధర్​రెడ్డి, చిలుకూరు, మోతె జడ్పీటీసీ, ఎంపీపీలు, అనంతగిరి జడ్పీటీసీ, కోదాడ మున్సిపల్​ చైర్మన్​ శీరీష్​ లక్ష్మీనారాయణ వేడుకులకు దూరంగా ఉంటున్నారు.  

ఆలేరులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్​అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు బలంగా ఉన్న ఆలేరు, భువనగిరిలో కనీస మర్యాద కూడా దక్కడం లేదని పలువురు వాపోతున్నారు.