కేయూ లిమిట్స్‌లో తగ్గిన స్టడీ సెంటర్లు
31 జిల్లాల నుంచి 11 జిల్లాలకు కుదింపు
169 నుంచి 50కి తగ్గిన సెంటర్లు
యూజీసీ రూల్స్ కారణంగానే అంటున్న ఆఫీసర్లు
ఇతర వర్సిటీలకు వర్తించని నిబంధనలు
పెద్దపల్లి, వెలుగు: రెగ్యులర్ గా చదువుకోలేని వాళ్లకోసం స్టార్ట్ చేసిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరమైపోతోంది. 20 ఏండ్ల కింద కాకతీయ యూనివర్సిటీ ప్రవేశపెట్టిన డిస్టెన్స్ స్టడీ సెంటర్లు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనల పేరిట మూతపడనున్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిస్టెన్స్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా 169 ఉండగా.. ప్రస్తుతం యూజీసీ రూల్స్ పేరిట 50 సెంటర్లకు పరిమితం చేసింది. దీంతో మిగిలిన సెంటర్ల వారికి దూర విద్య దూరమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
యూజీసీ రూల్స్ ప్రకారం కేయూ పరిధిని 31 జిల్లాల నుంచి 11జిల్లాలకు పరిమితం చేశారు. దీంతో ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్న కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (ఎస్డీఎస్సీ).. ఇప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితం కానుంది. ఇందులో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, మంచిర్యాల, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలలో మాత్రమే సెంటర్లు ఉండనున్నాయి.
శాతవాహన వర్సిటీలో డిస్టెన్స్ స్టడీ స్టార్ట్ కాలే
స్టడీ సెంటర్లు తగ్గించడంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో కేయూకు అడ్మిషన్లు తగ్గడంతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగా రెడ్డి, హైదరాబాద్ జిల్లాల వాళ్లు.. కేయూలో డిస్టెన్స్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో జాయిన్ కావాలంటే ప్రస్తుతం మిగిలిన 50 స్టడీ సెంటర్లలోనే చేరాల్సి ఉంటుంది. దీంతో.. క్లాసులకు, ఎగ్జామ్స్ కు అటెండ్ కావాలంటే మిగిలిన జిల్లాల వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. కరీంనగర్ కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఉన్నప్పటికీ దాని పరిధిలో ఇప్పటికీ డిస్టెన్స్ స్టడీ స్టార్టు కాకపోవడంతో డిస్టెన్స్‌లో డిగ్రీ, పీజీ చేయాలని భావించే ఉమ్మడి కరీంనగర్ జిల్లావాల్లపై ఎఫెక్టు పడనుంది.
ఆంధ్ర యూనివర్సిటీ సెంటర్లు కొనసాగింపు
రాష్ట్రంలోని కేయూ పరిధిలోని డిస్టెన్స్ స్టడీ సెంటర్లు తగ్గించినప్పటికీ ఏపీ నుంచి శ్రీవేంకటేశ్వర, నాగార్జున యూనివర్సిటీల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్టెన్స్ స్టడీ సెంటర్లు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ వర్సిటీలు కూడా తమ స్డడీ సెంటర్లను రాష్ట్రంలో కొనసాగిస్తున్నాయి. కానీ, కేయూలో మాత్రం సెంటర్లను కుదించడం వివాదంగా మారింది. యూజీసీ రూల్స్ కేవలం కేయూకే వర్తిస్తాయా.. లేక దేశంలోని అన్ని యూనివర్సిటీలకు వర్తిస్తాయా అనేది వర్సిటీ అధికారులే క్లారిటీ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
స్టాఫ్ పరిస్థితి ఏంటి?
స్టడీ సెంటర్లు ఎత్తివేయడంతో అందులో పన్జేస్తున్న సిబ్బందితో పాటు వారం వారం క్లాసులు చెప్పే కౌన్సెలర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని కేయూ పరిధిలోని స్టడీ సెంటర్లు యధావిధిగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిస్టెన్స్ లెర్నర్స్, కౌన్సెలర్లు కోరుతున్నారు.
For More News..