వర్ని, వెలుగు: పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి వాజీద్‌హుస్సేన్ హామీ ఇచ్చారు. ఉమ్మడి వర్ని మండలంలో బుధవారం ఆయన మండల వ్యవసాయాధికారి నగేశ్‌రెడ్డితో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రెండు రోజుల క్రితం వర్ని, చందూరు, మోస్రా మండలాల్లో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి. బాధిత రైతులతో మాట్లాడారు.
దెబ్బతిన్న పంటలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి వర్ని మండలంలో సుమారుగా 623 ఎకరాలు వరి పంట పాడైనట్లు గుర్తించామన్నారు. వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం చేస్తామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని ఆయన రైతులకు భరోసానిచ్చారు. వర్ని మండలంలో 63 మంది రైతులకు సంబంధించి 105 ఎకరాల్లో, చందూరు మండలంలో 255 మంది రైతులకు సంబంధించిన 428 ఎకరాల్లో, మోస్రా మండలంలో 94 మంది రైతులకు సంబంధించిన 90 ఎకరాల్లో వరిపంట కు నష్టం జరిగిందని ఆయన తెలిపారు.