ఎమ్మెల్యేల కొనుగోలు విషయం విచారణలో ఉందని, దాన్ని పోలీసులు చూసుకుంటారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. సీఎం సభకు స్వచ్ఛందంగా జనాలు తరలివస్తున్నారని చెప్పారు. సభకు మునుగోడు నియోజకవర్గ ప్రజలే వస్తున్నారన్న ఆయన... బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుషి కంపెనీ ద్వారా డబ్బులు పంపిణీ చేస్తూ నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు చండూర్ లో జరిగే సీఎం కేసీఆర్ సభలో మునుగోడు అభివృద్ధి పైనే సీఎం కేసీఆర్ మాట్లాడుతారని తెలిపారు. అడ్డంగా ఆడియోలు, వీడియోలు దొరికిన తరువాత ప్రమాణాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.
మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అభ్యర్థుల తమ హామీలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో నేడు మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ లో జరిగే సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు సమాచారం.