
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మిగిలిపోయిన 74 బెడ్రూం ఇండ్ల పంపిణీ రసాభాసగా మారింది. మంగళవారం ఎంపీపీ ఆఫీసులో నిర్మల్ ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ రాజమోహన్ అధికారుల సమక్షంలో ఇండ్ల పంపిణీకి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సమాచారం కొంతమందికే ఇచ్చారని పట్టణంలోని మహిళలు ఎంపీపీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. పలువురు మహిళలు మాట్లాడుతూ.. అర్హతలు లేని వారిని డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంపిక చేశారని ఆరోపించారు. సుభాష్ నగర్ కాలనీకి చెందిన ముస్లిం మహిళ తనకు ఇల్లు లేదని, కుటంబంలో వికలాంగుడు ఉన్నాడని ఇల్లు ఇవ్వాలని ధర్నా చేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది.
అయినా అధికారులు ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు. మొత్తం 420 డబుల్ బెడ్రూం ఇండ్లు ఉండగా మార్చి 2 న ఇండ్ల పంపిణీ జరిగింది. అందులో అర్హులు కాని 74 మందిని గుర్తించారు. మిగిలిన ఇండ్ల కోసం పట్టణంలోని 12 వార్డుల్లో సర్వే చేసి 74 మందిని ఎంపిక చేశారు. లక్కీ డ్రా సమాచారాన్ని మున్సిపల్ కౌన్సిలర్ల కు ఎందుకు ఇవ్వ లేదని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం అధికారులపై మండిపడ్డారు. మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లు రహస్యంగా ఈ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.