మునుగోడులో ఓటర్లకు నగదు మరియు చికెన్​, మద్యం పంపకాలు

నాంపల్లి/చౌటుప్పల్, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందో లేదో ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఓటర్లకు నగదు, చికెన్​, మద్యం పంపకాలు చేపడుతున్నారు. ఓ ప్రధాన పార్టీ ఒక్కో ఓటరుకు రూ.3వేల చొప్పున పంచుతుండడంతో, మరో పార్టీ అంతే మొత్తం పంచేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం పలుచోట్ల  ఓటర్లకు మద్యం, చికెన్​ పంచేందుకు రూలింగ్​పార్టీ లీడర్లు సిద్ధమవుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నాంపల్లి మండలంలో పస్నూర్​ లో టీఆర్​ఎస్ పార్టీ మాజీ సర్పంచ్​ పోగుల వెంకటరెడ్డి ఇంట్లో రూ.92వేల నగదు, లక్షా 25 వేల విలువగల మద్యం పట్టుబడినట్లు సీఆర్​ఎఫ్​ డీఎస్పీ సోఫ్నిల్​ తెలిపారు.

వెంకటరెడ్డి ఇంట్లో గంట పాటు సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో కూల్​ డ్రింక్స్​, వాటర్​ బాటిల్స్​ స్వాధీనం చేసుకుని సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. గోడగడియారాలు, గొడుగులు కూడా దొరికినట్టు తెలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని స్థితియతండాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు 80 కిలోల చికెన్ తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్​ మండల తుప్రాన్​పేటలో వెహికల్​ స్టెఫ్నీ టైర్​లో తరలిస్తున్న రూ.93.49 లక్షల నగదును  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్ గచ్చిబౌలి కి చెందిన రాజీవ్ యాదవ్ అనే బీజేపీ లీడర్​, హిమాయత్ నగర్ కు చెందిన మైసి నాందేవ్ ద్వారా రూ. 93. 49 లక్షల నగదును చౌటుప్పల్ తరలించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. క్యాష్​ను స్టెఫ్నీ టైర్​లో పెట్టుకొని నాందేవ్​ చౌటుప్పల్ ​బయలు దేరాడు.  పోలీసులు తూప్రాన్ పేట్ చెక్​పోస్ట్ వద్ద నాందేవ్​ వస్తున్న ఏపీ 09 సీఏ 3339 స్కార్పియో వాహనాన్ని తనిఖీ చేశారు. స్టెఫ్టీ టైర్​ను పరిశీలించిన పోలీసులు అందులో డబ్బు ఉన్నట్టు గుర్తించి, సీజ్​ చేశారు. నగదుతోపాటు వాహనాన్ని పోలీస్ స్టేషన్​కు తరలించారు.