గజ్వేల్ ​డబుల్ ఇండ్లు ఇచ్చేదెప్పుడు?

గజ్వేల్ ​డబుల్ ఇండ్లు ఇచ్చేదెప్పుడు?
  • రెండేళ్లుగా పెండింగ్ లో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల  పంపిణీ
  • లబ్ధిదారులు ఆందోళనలు చేసినా కదలని యంత్రాంగం
  • ఈ నెలాఖరుతో ముగుస్తున్న పాలక వర్గం గడువు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: గజ్వేల్ -ప్రజ్ఞాపూర్  మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ పరిష్కారం లేని సమస్యగా మారుతోంది. లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి రెండేళ్లవుతున్నా ఇంత వరకు అధికారులు ఇండ్లను అలాట్ చేయలేదు. నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదు మరోవైపు అధికారులు లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించడం లేదు. రెండేళ్లుగా ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనలు చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. గజ్వేల్ మున్సిపల్ పాలక వర్గం గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండడంతో లబ్ధిదారులు మరోసారి ఆందోళనలు ప్రారంభించారు.

మూడేండ్లుగా పెండింగ్​లో.. 

గజ్వేల్ మున్సిపాలిటీలోని పేదల కోసం 1250 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించగా అందులో 132 ఇండ్లను  పట్టణంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి కేటాయించగా మిగిలిన 1118 ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక  కోసం 2021 నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 3512 దరఖాస్తులు రాగా వీటి పరిశీలన కోసం జిల్లాస్థాయి అధికారుల బృందాలు  సర్వే నిర్వహించాయి. ఏడాదిన్నర పాటు సాగిన సర్వే అనంతరం 1118 మంది లబ్ధిదారులతో  డ్రాఫ్ట్ లిస్టును ప్రకటించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో లక్కీ డ్రా ద్వారా 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.

Also Read :- పార్ట్ టైమ్ లెక్చరర్ల వెట్టిచాకిరీ!

 నిర్వాసితులు ఖాళీ చేయడంలేదు.. 

గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాత్కాలికంగా కేటాయించారు. నిర్వాసితుల పరిహారం, ప్యాకేజీలు పెండింగ్ లో ఉండడంతో వారు ఇండ్లను  ఖాళీ చేయడం లేదు. రెవెన్యూ అధికారులు వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేసినా పూర్తి పరిహారం చెల్లించిన తర్వాతనే ఖాళీ చేస్తామని స్పస్టం చేయడంతో వారు వెనుదిరిగి పోయారు. దీంతో లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వారిని ఎలా ఖాళీ చేయించాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటుండగా మరోవైపు ఎంపికైన లబ్ధిదారులు తమకు ఇండ్లు ఎప్పుడిస్తారంటూ నిలదీస్తున్నారు.  

నిర్వాసితులను ఖాళీ చేయించి ఇండ్లు కేటాయిస్తాం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో తాత్కాలికంగా నివాసముంటున్న మల్లన్న సాగర్ నిర్వాసితులు ఖాళీ చేసిన వెంటనే ఇండ్లను లబ్ధిదారులకు కేటాయిస్తాం. లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగా వారికి ఇండ్ల కేటాయింపు, పొషిషన్ ఇవ్వడం కోసం రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నర్సయ్య, మున్సిపల్ కమిషనర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ