
- హనుమకొండ ఏషియన్ మాల్ పక్కన 600 ఇండ్లు సిద్ధం
- ఇండ్లిప్పిస్తమని డబ్బులు వసూలు చేసిన అప్పటి ఎమ్మెల్యే అనుచరులు
- అప్పట్లో అర్హుల ఆందోళనలతో పంపిణీకి భయపడ్డ గత ప్రభుత్వం
- పూర్తయిన ఇండ్లను అందించేందుకు ప్రస్తుత సర్కార్ కసరత్తు
- అనర్హులను రెచ్చగొట్టే కుట్రలకు అక్రమార్కుల ప్రయత్నాలు
వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్ లో డబుల్ ఇండ్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ గా తయారైంది. గత బీఆర్‍ఎస్ సర్కారు సిటీలో పలు చోట్ల డబుల్ ఇండ్ల నిర్మాణం చేపట్టి మధ్యలోనే ఆపేసింది. పూర్తయిన చోట లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. ఇండ్ల పేరిట ఆ పార్టీ నేతలు డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు. కాగా అసలు లబ్ధిదారులు, లంచాలు ఇచ్చినోళ్ల మధ్య ఇండ్ల పంపిణీ వివాదాస్పదంగా మారడంతో పంపిణీ వాయిదా పడింది.
అప్పటి సర్కార్ గ్రేటర్ వరంగల్ సిటీలో ఈస్ట్ సెగ్మెంట్ దేశాయిపేటలో 220, దూప కుంటలో తొలి విడతలో 600, హనుమకొండ ఏషియన్ మాల్ వెనక కాలనీలో 594, హంటర్‍రోడ్ శాయంపేటలో 580పైగా డబుల్ ఇండ్లు నిర్మించింది. అప్పటి ఎమ్మెల్యేల అనుచరులు ఇండ్లు ఇప్పిస్తామని అనర్హుల నుంచి రూ. లక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడడంతో పంపిణీ ఆగిపోయింది.
కల్లు, గుడాల దావత్ ఇవ్వాలంటూ హామీ
2015లో ఆనాటి సీఎం కేసీఆర్ వరంగల్ సిటీలో పర్యటించారు. హనుమకొండ బస్టాండ్ పక్కనే ఏషియన్ మాల్ వెనకాల అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ కాలనీల్లో పేదలు ఉండే గుడిసెల్లోకి వెళ్లారు. 300 ఇండ్లు ఉండగా.. వాటిని తొలగించి ఏడాదిలో డబుల్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఓపెనింగ్ కు తనే వస్తానని, కల్లు, గుడాలతో దావత్ ఇవ్వాలని మాటలతో ఖుషీ చేసి వెళ్లారు. 594 ఇండ్ల నిర్మాణం చేపట్టగా పూర్తి చేసేందుకు ఆరేడేండ్లు పట్టింది. గుడిసెల్లో ఉండే బాధితులు పరదాలు ఏర్పాటు చేసుకుని ఉండిపోయారు.
అప్పటి స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, మరికొందరు నేతలు ఒక్కో ఇంటికి రేటు కట్టి అనర్హులైన దాదాపు 1000 నుంచి 1200 మంది వద్ద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. దీంతో కొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
నాలుగేండ్ల కిందటే ఇండ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు కేటాయించలేదు. అసలైన లబ్ధిదారులు ఇండ్ల ముందు, కలెక్టర్ ఆఫీసు వద్ద ఆందోళనలు, ధర్నాలు చేశారు. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇండ్ల పంపిణీ పేరుతో రిబ్బన్ సైతం కట్ చేశారు. కానీ.. వాస్తవ లబ్ధిదారుల కంటే.. డబ్బులు ఇచ్చినవాళ్ల హడావిడి ఎక్కువైంది. దీంతో అప్పటి ఎన్నికల్లో ఇబ్బందవుతుందనే భయంతో బీఆర్ ఎస్ నేతలు ఇండ్లను పంపిణీ చేయలేదు. కట్టిన ఇండ్లు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి.
డబ్బులిచ్చిన అనర్హులను రెచ్చగొడుతూ..
కాంగ్రెస్ సర్కార్ ఇండ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేందుకుతోడుగా ఏషియన్‍మాల్ పక్కన 600, హంటర్‍రోడ్ శాయంపేట వద్ద మరో 600 ఇండ్ల పంపిణీ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి కసరత్తు చేపట్టారు. డబుల్ ఇండ్లు ఖాళీగా ఉండడంతో పాడవుతున్నాయని భావించి వచ్చే రెండు, మూడు వారాల్లో అసలు లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్లాన్ చేశారు. దీంతో ఇండ్ల పేరుతో డబ్బులు వసూలు చేసిన పలువురు బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
డబ్బులు ఇచ్చిన వ్యక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ద్వారా పంపిణీకి అడ్డుపడుతున్నారు. డబుల్ ఇండ్ల కోసం గతంలో ఇండ్లు కోల్పోయినవారి జాబితా అధికారుల వద్ద ఉండగా వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో గ్రేటర్ ఇండ్ల పంపిణీ మరోమారు హాట్ హాట్ గా మారింది.
పదేండ్లుగా ఎదురుచూస్తున్నం
కేసీఆర్ మాకు ఇండ్లు కట్టిస్తానని చెప్పి.. మా గుడిసెలు కూల్చిండు. ఏడాదిలో డబుల్ ఇండ్లు కట్టిస్తామని చెబితే సంబురపడ్డాం. ఇదేచోట చెట్టుకొకలం..పుట్టకొకలం పరదాలు కట్టుకుని పదేండ్లుగా డబుల్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఎన్నోసార్లు ఆందోళన చేసినా..ఇప్పటికీ ఇండ్లయితే ఇవ్వట్లేదు. - రాజు, లబ్ధిదారుడు, జితేందర్‍సింగ్ కాలనీ
త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తాం..
గత సర్కారు డబుల్ ఇండ్లను ఏడాదిలోపు నిర్మించి ఇస్తామని చెప్పి ఆరేండ్ల దాకా ఇవ్వలేదు. లబ్ధిదారులు ధర్నాలు, ఆందోళనలు చేసినా పంపిణీ చేయలేదు. బీఆర్‍ఎస్ లీడర్లు ఇండ్ల పేరిట రూ. లక్షల్లో వసూలు చేయగా.. అసలు లబ్ధిదారులతో వివాదం నెలకొంది. దీంతో అప్పట్లో పంపిణీ చేయలేదు. తమ ప్రభుత్వం వచ్చాక నిజమైన లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. త్వరలోనే ఇండ్లను కేటాయిస్తాం. - నాయిని రాజేందర్‍రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే