అశ్వారావుపేట, వెలుగు : మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్ట్ (జేవీఆర్) ద్వారా 52 మంది గిరిజన రైతులకు రూ. 33 లక్షల విలువైన ఎలక్ట్రికల్ పంపుసెట్లను మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో కలిసి అందజేశారు. గురువారం మండలంలోని నెమలిపేటలో గిరిజనులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
గిరిజన గ్రామాలలో వర్షాలపైనే ఆధారపడి పంటలను సాగు చేసి నష్టాలు పాలవుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితి తెలుసుకొని జేవీఆర్ ట్రస్ట్ గిరిజనులకు మోటార్లను అందించడం అభినందనీయమన్నారు. జలగం ప్రసాదరావు మాట్లాడుతూ గిరిజన పొలాలకు సాగునీరు అందించి
వారంతా ఆర్థిక బలోపేతం కావడమే ట్రస్ట్ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ట్రాన్స్ కో ఏడీ బి.వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ చిన్నం శెట్టి సత్యనారాయణ, నిర్మల పుల్లారావు, జూపల్లి రమేశ్, చెన్నకేశవరావు, కోటగిరి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు.