హైదరాబాద్ సిటీలో మే1 నుంచి సన్న బియ్యం పంపిణీ

హైదరాబాద్ సిటీలో మే1 నుంచి సన్న బియ్యం పంపిణీ

గ్రేటర్​ పరిధిలో కొత్త రేషన్​కార్డుల దరఖాస్తులు గుట్టల్లా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన వాటినే పరిశీలన చేయడానికి అధికారులు సతమతం అవుతుంటే.. రోజురోజుకూ మీసేవ ద్వారా వచ్చే దరఖాస్తుల భారం మోయలేక తలలు పట్టుకుంటున్నారు. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ జోరుగా జరుగుతుండడంతో.. సిటీలో రేషన్​కార్డులు లేని వారంతా మీసేవకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఒక్క మీ సేవ ద్వారానే తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 3.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. 

సిటీలో మొన్నటివరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ​అమల్లో ఉండడంతో కొత్తగా ప్రవేశపెట్టిన సన్న బియ్యాన్ని ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఈ నెల 25న కోడ్​ ముగియడంతో మే 1 నుంచి సన్నబియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. నగరంలోని 653 షాపులకు వారి ఇండెంట్ల ప్రకారం సివిల్​సప్లయ్​ గోదాముల నుంచి బియ్యాన్ని కేటాయిస్తున్నారు. కార్డుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మొత్తం 15 వేల మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల జాబితాను బట్టి ఒక్కొక్కరికి ఆరు కేజీల బియ్యాన్ని అందజేస్తామన్నారు.

 రేషన్​షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యంలో క్వింటాల్​కు ఒక కిలో సార్టెక్స్ ​రైస్​ను కలిపి ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. సార్టెక్స్ రైస్​ ఆరోగ్యకరమైనవి, ఇవి ప్లాస్టిక్​ రైస్​ తరహాలో ఉంటాయి. కాబట్టి ఎవరూ బియ్యంలో ప్లాస్టిక్​ రైస్​ వచ్చిందన్న అనుమానాలు పెంచుకోవద్దని అధికారులు చెబుతున్నారు. బియ్యం పంపిణీలో డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా వెంటనే సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాలన్నారు.