
దేశం ప్రగతిపథంలో నడవాలంటే మధ్యతరగతి, పేదవర్గాల అభ్యున్నతికి బాటలు వేయాలి. అందుకే ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటాయి. అలాంటివాటిలో గొప్ప పురోగతి సాధించింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది దేశంలో నివసిస్తున్న నూటికి 80మంది పేదల గతిని మార్చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం సైతం తను అమలు చేస్తున్న ఎన్నో పథకాలతో ఆ దిశగానే ముందుకు కొనసాగుతోంది. తాజాగా సన్నబియ్యం పంపిణీ పథకం సైతం సమాజంలోని పేద, గొప్ప తారతమ్యాలను దూరం చేసిన పథకమే. కోటి విద్యలు కూటి కోసమే అనేది ప్రసిద్ధ నానుడి. దాన్ని ఆచరణకు తెస్తూ ధనవంతుల కంచంలోకి వెళ్లే సన్నబియ్యం ముద్దను.. నేడు పేదవాడు సైతం అంతే ఆత్మగౌరవంతో తినే అవకాశం కల్పించింది ప్రజా ప్రభుత్వం. పేదల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేస్తూ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీరామ నవమి లాంటి పర్వదినాన ఓ నిరుపేదకు అందిన ప్రభుత్వ సన్నబియ్యంతో పెట్టిన బోజనం చేయడం నిజమైన రామపాలనకు ఆదర్శం. ఈ పథకం ద్వారా ప్రభుత్వంసైతం ఊహించనంత మంచిపేరును సంపాదించుకుంటున్నది. లొసుగులు వెతికే విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్న పథకం సన్నబియ్యం పంపిణీ.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 2.85కోట్ల మంది లబ్ధి పొందనున్నారు, ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 17వేలకు పైగా రేషన్ షాపులకు సన్నబియ్యం చేరుకోవడం, అందులో సింహభాగం పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 90 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఈ సంఖ్య కొత్త కార్డుల జారీ అనంతరం దాదాపు కోటి కార్డులకు చేరుకుంటుంది. ఈ దామాషా ప్రకారం రాష్ట్ర వాటాగా వినియోగదారుల్ని పెంచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కానీ, ఇప్పటివరకూ కేంద్రం కేవలం 53 లక్షల కార్డులను మాత్రమే మంజూరు చేసింది. వీరికి సైతం కార్డుకు నలుగురు చొప్పున ఒక్కొక్కరికి కేవలం 5కిలోల దొడ్డు బియ్యాన్ని మాత్రమే సరఫరా చేసేది. అంటే సగం కార్డులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ సమకూరుస్తుంది. అయితే, మొత్తం 2.85 కోట్ల మంది లబ్ధిదారులకు అదనంగా కిలోతో కలిపి ప్రతి నెల దాదాపు 2లక్షల మెట్రిక్ టన్నుల పోషకాలతో కూడిన సన్నబియ్యం పంపిణీ చేయడం విప్లవాత్మకం. ఇందుకోసం సగం ఖర్చు రూ.5వేల కోట్లకు పైగా ప్రభుత్వం అదనంగా ఖర్చుచేస్తున్నది.
పెరిగిన పేదల ఆరోగ్యం, ఆత్మగౌరవం
సన్నబియ్యం పంపిణీ అనేది ఓవైపు పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచుతూనే మరోవైపు వేలకోట్ల అక్రమ దందాలకు చెక్ పెట్టనుంది. గతంలో కేవలం నాణ్యత లేని దొడ్డుబియ్యం మాత్రమే ఇవ్వడంతో వాటిని దళారులు 7 నుంచి పది రూపాయలకు కొని మిల్లర్లకు అమ్మేవారు. వీటిని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వాలకే 40 రూపాయలకు అంటగట్టడం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం రావడమే కాకుండా దళారులు, అవినీతి అధికారులు, మిల్లర్లు ఇలా ఎంతో మందికి ఈ డబ్బు చేతులు మారి బ్లాక్ మార్కెట్ దందా పెద్ద ఎత్తున కొనసాగేది. దాంతోపాటు కోళ్ల దాణాగా, బ్రూవరీలకు, ఇథనాల్ కోసం ఈ బియ్యం మళ్లించడంతో దుర్వినియోగమయ్యేవి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దందాను చాలావరకు అరికట్టినా.. వ్యవస్థీకృతం అయిన బియ్యం దందాను పూర్తిగా అరికట్టాలనే సంకల్పంతో సకాలంలో సీఎంఆర్ అప్పగించని మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టడం, 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలం వేయడంతో పాటు, మిగిలిన బియ్యాన్ని సైతం పిలిప్పీన్స్ వంటి దేశాలకు స్వయంగా ప్రభుత్వమే ఎగుమతి చేయడం వంటి చర్యల్ని చేపట్టారు. ఇక ఇప్పుడు అమల్లోకి వచ్చిన సన్నబియ్యం పంపిణీతో అక్రమ దందాలకు సంపూర్ణంగా చరమగీతం పాడినట్లైంది.
తెలంగాణలో మాత్రమే సన్నబియ్యం పంపిణీ
దేశంలో 29 రాష్ట్రాల్లో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే సన్నబియ్యం పంపిణీ చేయడం వారికి పేదల పట్ల గల నిబద్ధతకు నిదర్శనం. సన్నాలను ప్రోత్సహించాలనే సంకల్పంతో వాటికి 500 రూపాయల బోనస్ ప్రకటించడం, అందుకనుగుణంగా పంట పంటకూ సన్నాల సాగు విస్తీర్ణం పెరగడం, అంతిమంగా ఫైన్ రైస్ నాణ్యతతో రేషన్ కార్డుదారులకు చేరాలనే సంకల్పంతో మర ఆడించిన మూడు నెలలు వాటిని మాగపెట్టడం జరిగింది. ఇవ్వాళ రాష్ట్రంలోని ప్రతి కంచంలోకి నాణ్యమైన పోషకాలతో కూడిన సన్నబియ్యంతో కూడిన అన్నం ముద్ద చేరుతోంది. త్వరలోనే నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టడంతోపాటు డిజిటల్ క్యూఆర్ కోడ్ లతో కూడిన కార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టి దుర్వినియోగం కాకుండా బీపీఎల్, ఏపీఎల్ కార్డులను అందిస్తామని
ప్రభుత్వం ప్రకటించింది.
ఆధార్- రేషన్ అనుసంధానం
రాష్ట్రంలోని ఏ చౌకధరల దుకాణంలోనైనా రేషన్ తీసుకొనేవిధంగా రేషన్ పోర్టబులిటీలో వందశాతం సాధించడం, ఆధార్-– రేషన్ అనుసంధానం, అన్ని దుకాణాల్లో అత్యాధునిక డిజిటల్ ఈపాస్ యంత్రాలతో పంపిణీ లోనూ దేశంలోనే తెలంగాణ ఎంతో ముందుంది. ఈ విధానాలతో పేదవాడికి ప్రభుత్వం అందించిన ప్రయోజనం సంపూర్ణంగా చేరుతోంది.
9 రకాల నిత్యావసర సరుకుల్ని సైతం రేషన్ షాపుల ద్వారా అందించాలనే దిశగా ప్రభుత్వ ఆలోచనలు సాగుతున్నాయి. పేదవాడి జీవన ప్రమాణాలు పెంచే పని ఏ ప్రభుత్వం చేసినా అది దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ దిశలోనే సన్నబియ్యం పంపిణీ పథకం బాటలు వేస్తోంది.
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో,
టిసాట్ నెట్వర్క్