
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి పట్టాల పంపిణీ నత్తనడకన సాగుతోంది. సింగరేణి ప్రాంతంలో మొత్తం 13 వేలకు పైగా ఇండ్లు ఉన్నాయి. ఇందులో మొదటి విడతలో కేవలం 1,815 మందికే పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 76 ప్రకారం మొదటి విడతలో 6,768 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్ల స్థలాల పట్టాలు పంచాలని మంత్రి కేటీఆర్ ప్రకటించి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు కేవలం 1,815 మందికి పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలందని వారికి ఈ జూన్ 30 వరకు గడువు పెంచడంతో దాదాపు మరో 3 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు.
మొదటి విడతలో ఇంటింటి సర్వే చేసిన అధికారులు దాదాపు 2665 మంది దరఖాస్తులు తిరస్కరించనట్లు సమాచారం. రిజెక్ట్ అయిన వారు తిరిగి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినా సమాచార లోపంతో కేవలం 74 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకోగా 2,591 మంది ప్రజలు దరఖాస్తులు చేసుకోలేదు.
సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి యాజమాన్యపు హక్కు కల్పిస్తున్నట్లు మొదటిసారిగా ప్రభుత్వం జీవో నెంబర్ 56, 58 లను తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం రెగ్యులరైజేషన్ కొరకు 1,307 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో కేవలం 50 మందికి మాత్రమే అధికారులు పట్టాలు పంపిణీ చేశారు. మిగతా వారికి పట్టాలు ఇవ్వలేదు. తర్వాత ప్రభుత్వం జీవో నెంబర్ 76 ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. అందులో కూడా కొందరికే పట్టాలు పంపిణీ చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.
ఈ 10 రోజుల్లో పట్టాల పంపిణీ పూర్తి చేస్తాం..
ప్రభుత్వం ఇండ్ల స్థలాలకు పట్టాలు జారీ చేసినందున వారందరికీ 10 రోజుల్లో పట్టాల పంపిణీ పూర్తి చేస్తాం. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో వీటిని ప్రజలకు అందజేస్తాం. 2వ విడతలో దరఖాస్తు చేసుకున్న వారి విషయం పరిశీలనలో ఉంది.
- బెల్లంపల్లి తహసీల్దార్, దండి మధుసూదన్