కరీంనగర్: తెలంగాణలో 2025, జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం (జనవరి 12) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. గత పదేళ్లలో కేవలం 49 వేలు కార్డులు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ దుకణాల్లో తినడానికి వీలులేని బియ్యం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల కింద ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇండ్ల స్థలం ఉండి, ఇండ్లు లేని వారికి కట్టించేందుకు రెడీ అవుతున్నామని.. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తిచేసి వాటిని ప్రజలకు కేటాయిస్తామని చెప్పారు.
ALSO READ | ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలే.. కౌశిక్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలు ఇచ్చామని.. రైతులకు రూ.22.500 కోట్లు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. తాను సుధీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నానని.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పథకాలు యావత్ భారతదేశంలో ఎక్కడా లేవని అన్నారు. అన్ని జిల్లాలు తిరిగి రైతు భరోసాపై స్పష్టమైన అవగాహనకు వచ్చి వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు 12వేలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. వ్యవసాయ కూలీలకు ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.12 వేలు ఆర్థిక సహయం అందజేస్తామన్నారు.
ఇక జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు షట్టర్లు బిగించి, రైతులకు ఉపయోగపడేలా చేస్తామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవసరమైన ప్రతి ప్రాజెక్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి- ఉమ్మడి జిల్లాలోని అందరు కలెక్టర్లకు స్పష్టమైన కార్యాచరణ ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోదామని.. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ ల మధ్య జరిగిన వాగ్వాదంపైన ఉత్తమ్ స్పందించారు. కౌశిక్ రెడ్డి తీరు సరికాదని.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.