- నాగర్‌కర్నూల్ జిల్లాలో లిస్టులు ఇవ్వని ఇద్దరు ఎమ్మెల్యేలు
నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లాలో బీసీ కుల వృత్తుల వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.1లక్ష సాయం పంపిణీ నిలిచిపోయింది. పోయిన నెల 15లోగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు మాత్రమే లిఫ్ట్ ఫైనల్ చేశారు. ఆ లిస్ట్‌లను జిల్లా మంత్రి అప్రూవల్ కోసం పంపించారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల్లోనే లిస్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బిజీగా ఉండడంతో లక్ష సాయం అప్లికేషన్ల ఫైనల్ లిస్ట్ తయారీలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఇక లోన్లకు అప్లై చేసుకున్నోళ్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అన్నా జర చెప్పరాదే అంటూ చోటా మోటా లీడర్లను బతిమిలాడుతున్నారు.
కాంగ్రెస్, బీజీపీ వాళ్లే ఎక్కువ ఉన్నరు..
లక్ష సాయం కోసం అప్లై చేసిన వారిలో బీఆర్ఎస్ మద్దతుదారులు, కార్యకర్తల కంటే కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారి పేర్లే ఎక్కువగా ఉన్నాయని కంప్లైంట్లు వెళ్లడంతో రాష్ట్ర స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారిని పక్కన పెట్టి ఎమ్మెల్యేల నుంచి వచ్చే లిస్టులను ఫైనల్ చేయాలని ఆదేశాలు రావడంతో, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో 1,100 మందికి రుణాలు ఇచ్చేందుకు నిధులు రిలీజ్ అయ్యాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి 20,640 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 18 వేల మందిని అర్హులుగా గుర్తించారు. ఒక నియోజకవర్గంలో 300 మందికి ఈ సాయం ఇచ్చే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీల్లో 30 నుంచి 50 మందికి వచ్చే అవకాశం ఉంది. ఇక నియోజకవర్గంలో 250 నుంచి 280 వరకు రెవెన్యూ విలేజ్‌లు ఉన్నాయి. మున్సిపాలిటీలను తప్పిస్తే గ్రామానికి ఒక యూనిట్ చొప్పున వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు రాని వారు, ఉద్యోగాలపై ఆశలు వదులుకున్న వారు ఈ స్కీం కింద అప్లై చేసుకున్నారు. ప్రతి మండలంలో 800 నుంచి 1000 మంది అప్లై చేశారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో 740 మంది అప్లై చేస్తే 30 మందికి మాత్రమే సాయం వస్తుందని తేలడంతో అధికార పార్టీ కౌన్సిలర్లు ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. బిజినేపల్లి మండలంలో 1,877, నాగర్ కర్నూల్ మండలంలో 1,423, పెద్ద కొత్తపల్లి మండలంలో 1,300 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. అప్లై చేసిన వారి అప్లికేషన్లను పరిశీలించే బాధ్యతలను ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. వారు నామ్‌కే వాస్తేగా పరిశీలించగా, అసలు లిస్ట్‌లు మాత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల్లో రెడీ అవుతున్నాయి. మున్సిపాలిటీల్లో చైర్మన్లకు, మండలాల్లో ఎంపీపీలకు లిస్టుల తయారీ బాధ్యత అప్పజెప్పారు. వీరు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి లబ్ధిదారులను ఎంపిక చేసి ఎమ్మెల్యేలకు లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
అన్నా మనోళ్ల పేర్లు లేవు..
బీసీ సాయం కోసం అధికార పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల్లో అర్హులైన వారు అప్లై చేసుకోలేదు. అప్లికేషన్ల పరిశీలన తర్వాత లిస్ట్ చూస్తే అందులో కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల పేర్లే ఎక్కువగా ఉండడంతో పంచాయితీ ఎమ్మెల్యేల వద్దకు చేరింది. పలువురు ఎమ్మెల్యేలు ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్‌రావును కలిసి పరిస్థితి వివరించడంతో టెంపరరీగా నిలిపివేయండని ఓరల్ ఆర్డర్స్ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్టుల ప్రకారమే సాయం అందించాలని ఆదేశాలు రావడంతో లిస్ట్‌ల కోసం బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.