డబుల్ ఇండ్లలో అవకతవకలు జరిగితే ఉద్యోగం నుంచి తీసేస్తం : కేటీఆర్

డబుల్ ఇండ్లలో అవకతవకలు జరిగితే ఉద్యోగం నుంచి తీసేస్తం : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తి బాధ్యత అధికారులదేనని మంత్రి కేటీఆర్ అన్నారు. తప్పుచేసిన వారిని ఉద్యోగం నుంచి తీసేసే స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  జీహెచ్ఎంసీ పరిధిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంపై శుక్రవారం సెక్రటేరియెట్​లోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్​లో విస్తృత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 21న హైదరాబాద్​లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇండ్ల ఎంపికలో ఎవరి ప్రమేయం లేదని, అత్యంత పారదర్శకంగా పేదలకు మాత్రమే అందిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వ అధికారులకే అప్పగించామని, కంప్యూటర్‌‌ ఆధారిత డ్రా తీస్తామని వెల్లడించారు.  ఈ అంశంలో ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ల సూచించారు.  

రెండో విడతలో 13,300 ఇండ్లు పంపిణీ  

హైదరాబాద్ నగరంలో మొదటి విడతలో 11,700 ఇండ్లను పేదలకు అందించామని, రెండో విడతలో దాదాపు 13,300 ఇండ్లను అందించనున్నట్లు చెప్పారు. సిటీలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయన్నారు. 58, 59 జీవోల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించనుందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. త్వరలో హైదరాబాద్‌‌లోనూ గృహలక్ష్మి పథకంను ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.  

మెడికల్​ కాలేజీల ఓపెనింగ్​ పండుగలా చేయాలె

రాష్ట్రంలో కొత్త మెడికల్​ కాలేజీల ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. 15న తొమ్మిది (జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం) జిల్లాల్లో మెడికల్ ​కాలేజీలు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి హరీశ్​ రావుతో కలిసి కేటీఆర్​ హైదరాబాద్ ​నుంచి ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో  టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. 

ఓపెనింగ్ సందర్భంగా  జిల్లా కేంద్రాల్లో 20 వేల మందికి తగ్గకుండా  భారీ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు.  దేశంలోనే అతి ఎక్కువ ఎంబీబీఎస్​సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని  మంత్రి హరీశ్​రావు చెప్పారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్​ సీట్లలో 43 శాతం తెలంగాణలోనే పెరిగాయని పేర్కొన్నారు.