గీత కార్మికులకు కాటమయ్య రక్ష..రెండో దశ కిట్ల పంపిణీ షురూ

గీత కార్మికులకు కాటమయ్య రక్ష..రెండో దశ కిట్ల పంపిణీ షురూ
  • రెండో దశ కిట్ల పంపిణీ షురూ
  • ఎమ్మెల్సీ కోడ్ ముగియడంతో తొలగిన అడ్డంకి
  • రెండో దశలో 10 వేల కిట్లకు8 వేల మందికి ట్రైనింగ్ పూర్తి
  • తొలి దశలో 10 వేల కిట్ల  పంపిణీ 
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో 40వేల  కిట్లివ్వాలని సర్కారు నిర్ణయం!

హైదరాబాద్, వెలుగు: గీత కార్మికులను  ప్రమాదాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కాటమయ్య సేఫ్టీ కిట్ల పంపిణీకి ఎమ్మెల్సీ ఎలక్షన్​ కోడ్​ ముగియడంతో అడ్డంకి తొలగింది.  రెండో దశ కిట్ల పంపిణీ ప్రారంభమైంది.  తొలి దశలో 100 నియోజకవర్గాల్లో గీత కార్మికులకు 10 వేల కిట్లను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. రెండో దశలో 10 వేల కిట్ల పంపిణీకి ప్రభుత్వం జీవో ఇచ్చింది.  బీసీ సంక్షేమ శాఖలోని టాడీ టాపర్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు కిట్ల వాడకంపై   ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్​అందజేస్తున్నారు. రెండో దశలో 10 వేల కిట్లకుగానూ 8 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు.. అన్ని జిల్లాల్లో ట్రైనింగ్ ను పూర్తి చేశారు. ఒక్కో కిట్ ధర, ట్రైనింగ్ కలిపి రూ. 13 వేలు ఖర్చు అవుతుండగా.. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. ఇప్పటికే రెండో దశలో 1500 కిట్లను పంపిణీ చేసింది. అయితే, గత నెల రోజుల నుంచి 7 ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పంపిణీ నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్ పూర్తి కావడంతో కిట్ల పంపిణీ  తిరిగి ప్రారంభమైంది.

ఈ ఏడాది జులైలో స్కీమ్​ ప్రారంభం

 రాష్ట్రవ్యాప్తంగా లక్షా 80 వేల మంది గీత కార్మికులు ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.  తాటి, ఈత చెట్లు తగ్గిపోతుండడం, చెట్లను నరికేస్తుండడం, ఉపాధి లేకపోవడంలాంటి కారణాలతో ఈ వృత్తికి గీత కార్మికులు దూరమవుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే, చెట్లు ఎక్కే క్రమంలో మోకుల సమస్యలతో చెట్ల మీద నుంచి కింద పడి మరణిస్తున్నారని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత పదేండ్లలో సుమారు 750 మంది గీతకార్మికులు ప్రమాదంలో మృతిచెందినట్టు తెలిపారు. శాశ్వత వైకల్యానికి గురైన వాళ్లు సుమారు 2 వేల మంది ఉండగా, పాక్షిక వైకల్యం పొందిన వాళ్లు 2,700 మంది ఉన్నారని, మొత్తం 5,500 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ బాధితులకు పరిహారం కింద సుమారు రూ. 65 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.  ఈ నేపథ్యంలో గౌడన్నల రక్షణ కోసం  కాటమయ్య సేఫ్టీ కిట్ ఇచ్చే స్కీమ్ ను నిరుడు జులైలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ లో సీఎం రేవంత్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అదే సమయంలో కిట్లు పంపిణీ చేసి కార్మికులతో సీఎం మాట్లాడారు. వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు.

కిట్లకు ఫుల్​ డిమాండ్​

రాష్ట్రంలో లక్షా 80 వేల మంది గీత కార్మికులు ఉండగా ఇప్పటి వరకూ తొలి దశలో 10వేల కిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇపుడు రెండో దశలో భాగంగా మరో 10 వేల సేఫ్టీ కిట్లను కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. అన్ని జిల్లాల్లో కిట్లను ఇవ్వాలని గీత కార్మికులనుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ఎమ్మెల్యేలు, మంత్రులు, బీసీ వెల్ఫేర్ అధికారులు తీసుకెళ్లారు. వాస్తవానికి రెండో దశ కిట్లను వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో ఇవ్వాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించినా, డిమాండ్ అధికంగా ఉండడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పంపిణీ  చేస్తున్నది. ఈ కిట్లకు సంబంధించి టాడీ టాపర్స్ కోపరేటివ్ కార్పొరేషన్ కు గత ఏడాది అక్టోబర్ లో రూ. 34  కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. రెండో దశలో ఇచ్చే 10 వేల కిట్లతోపాటు ఈ నెల 31లోపు మరో 5వేల సేఫ్టీ కిట్లు ఇచ్చేందుకూ సమాలోచన చేస్తున్నది. అలాగే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 40వేల కిట్లను పంపిణీ చేయాలని భావిస్తున్నది. కాగా, గీత కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం కాటమయ్య సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తుండడం అభినందనీయమని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నేత సంపునూరి మల్లేశం గౌడ్ తెలిపారు.వచ్చే సంవత్సరం మరిన్ని ఎక్కువ కిట్లను అందించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ప్రాణం కాపాడిన కిట్​ 

కాటమయ్య రక్ష కిట్​ ఓ గీత కార్మికుడి ప్రాణం కాపాడింది. ఖమ్మం జిల్లా  బోనకల్లు మండలం రావినూతల గ్రామానికి చెందిన బంధం పెద్ద గోవిందుకు చెట్టు ఎక్కి దిగే క్రమంలో కాలుజారింది. కాటమయ్య కిట్​ ఉండడంతో చెట్టుపైనే జారకుండా ఉండిపోయాడు. గమనించిన సమీపంలోని రైతులు, గీత కార్మికులు ట్రాక్టర్​ తీసుకొచ్చి.. దాని మీద నిచ్చెన వేసుకొని ఎక్కి గోవిందును జాగ్రత్తగా కిందకు దించారు.  కాటమయ్య కిట్​ ఉండడంతోనే గోవిందు ప్రాణాలతో బయటపడ్డాడని తోటి గీత కార్మికులు తెలిపారు.