నా నియోజకవర్గంలో నీకేం పని?.. బీసీలకు లక్ష సాయం చెక్కుల పంపిణీలో లొల్లి లొల్లి

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఆర్డీవో ఆఫీసులో గురువారం జరిగిన బీసీలకు లక్ష సాయం  చెక్కుల పంపిణీ ప్రోగ్రాం రసాభాసగా సాగింది. లోకల్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు మధ్య వాగ్వాదం కాస్తా అదుపుతప్పి బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ వర్గీయుల నినాదాలతో హోరెత్తింది.  తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  రెండు పార్టీల లీడర్లు బాహాబాహీకి దిగారు.  తనకు తెలియకుండా లబ్ధిదారుల ఎంపిక ఎలా చేశారని బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ ఇందిరను  లోకల్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య నిలదీశారు. అడ్డగోలుగా లిస్టు ఉందని నిరసన తెలిపారు. ఇదే టైంలో విప్​ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాత మధుకు భద్రాచలం నియోజకవర్గంలో  ఏం పని? అని అసహనం వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

బీఆర్​ఎస్​ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్​ క్యాంపు ఆఫీసు నుంచి లబ్ధిదారులకు ఫోన్లు వెళ్లాయని కాంగ్రెస్​ లీడర్లు ఈసందర్భంగా ఆరోపించారు.   పంపిణీ  ప్రోగ్రాంకు రేగా కాంతారావు, తాత మధు రావడాన్ని ఎమ్మెల్యే వీరయ్య తీవ్రంగా ప్రతిఘటించడంతో  విప్​ రేగా కాంతారావు అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్​ చేసి విప్​గా తనకు ఉన్న పవర్స్​ గురించి అడిగారు. ఆయన నుంచి క్లారిటీ తీసుకుని ఆఫీసర్లకు, ఎమ్మెల్యేకు వివరించడంతో సభ షురూ అయ్యింది. అయితే చెక్కుల పంపిణీ మాత్రమే జరగాలని, రాజకీయాలు, ఆరోపణలు మాట్లాడొద్దని వీరయ్య షరతు పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పే హక్కు తనకు ఉందని,  ఇందుకు ఎవరి పర్మిషన్​ అవసరం లేదని వ్యాఖ్యానించారు.  

రేగా కాంతారావు మాట్లాడుతుండగా ఎమ్మెల్యే వీరయ్య  మైక్​ లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ తాత మధు ఇద్దరిని బుజ్జగించారు. అడ్డుకుంటే గంట సేపు మాట్లాడుతానని రేగా హెచ్చరించారు. వీరయ్య అడ్డగించడంతో మధ్యలోనే  కాంతారావు స్పీచ్​ ముగించారు. అనంతరం మూడు మండలాల్లోని 170 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వీరయ్యకు చట్టాలు, జీవోలపై అవగాహన లేదని రేగా కాంతారావు 
ధ్వజమెత్తారు.