మీటింగ్‌‌‌‌లు.. ట్రైనింగ్‌‌‌‌లు.. తనిఖీలు

  • బిజీ అయిన జిల్లా అధికార యంత్రాంగం
  • ఎన్నికల కోడ్ అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం

నల్గొండ అర్బన్, వెలుగు: ఎన్నికల షెడ్యూల్ రావడంతో జిల్లా అధికార యంత్రాంగం బిజీ అయ్యింది. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎన్నికల సిబ్బందితో మీటింగ్‌‌‌‌లు పెట్టి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో పాటించాల్సిన రూల్స్‌‌‌‌పై శిక్షణ ఇస్తున్నారు. పోలీసులు పీఎస్‌‌‌‌ల పరిధిలో చెక్‌‌‌‌పోస్టులు ఏర్పాటు చేసి వెహికల్ చెకప్ చేస్తున్నారు.  మంగళవారం నల్గొండ కలెక్టర్ ఆర్‌‌‌‌‌‌‌‌వీ కర్ణన్ ఆర్వోలు, ఏఆర్వోలు, ఎఫ్ఎస్‌‌‌‌టీ, ఎంసీసీ, వీఎస్టీ, ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌టీ, అకౌంటింగ్, వ్యయ పర్యవేక్షణ అధికారులకు ఎన్నికల నియామవళిపై శిక్షణ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయవద్దన్నారు. రాజకీయ పార్టీల దరఖాస్తు మేరకు మైదానాలు, స్కూల్‌‌‌‌, కాలేజీ స్థలాలను సభలకు కేటాయించాలని ఆర్వోలకు సూచించారు. పార్టీలు రాజ్యాంగాన్ని భంగపరిచే విధంగా మేనిఫెస్టోలు, హామీలు ఇవ్వొద్దని, మతపరమైన ప్రసంగాలు చేయవద్దన్నారు. 

ఓటర్లను ధనబలం, అంగబలంతో ప్రలోభపెట్టొద్దని,  డబ్బు, మద్యంతో పాటు ఇతర వస్తువులు పంపిణీ చేసినా కోడ్ ఉల్లంఘనే అవుతుందన్నారు.  అభ్యర్థికి నామినేషన్‌‌‌‌ సమయంలో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని, ప్రచారానికి మాత్రం ఆర్వో అనుమతితో ఎక్కువ వాహనాలను వినియోగించవచ్చన్నారు. అభ్యర్థి ముందుగా బ్యాంక్ అకౌంట్ తెరిచి.. దాని నుంచే అన్ని రకాల చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్నారు.  10 వేలకు మించి ఎన్నికల సామగ్రి, రూ. 50 వేల కంటే ఎక్కువ  డబ్బులు రవాణా చేయవద్దన్నారు.  ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై   సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వోలు హేమంత్ కేశవ్ పాటిల్, జె.శ్రీనివాస్, రవి, చెన్నయ్య, శ్రీరాములు, దామోదర్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ హరి సింగ్  తదితరులు పాల్గొన్నారు. 

 కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి

యాదాద్రి, వెలుగు: ఎన్నికల కోడ్​ పకడ్బందీగా అమలు చేయాలని యాదాద్రి కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన కంట్రోల్​ రూమ్‌‌‌‌ను మంగళవారం  పరిశీలించారు.  అనంతరం ఎన్నికల విధులు నిర్వర్తించే ఆఫీసర్లతో  మీటింగ్‌‌‌‌ పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నియమావళిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి సెక్టార్ ఆఫీసర్​కు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సు టీమ్స్​కు కేటాయించిన విధులు, నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. కోడ్‌‌‌‌ ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించే సమయంలో ముందస్తుగా ఆధారాలు సేకరించాలని, రిటర్నింగ్ ఆఫీసర్​కు సమాచారం అందించాలని సూచించారు. అడిషనల్​ కలెక్టర్లు జీ వీరారెడ్డి, ఏ భాస్కర్​రావు, ఆర్డీవో అమరేందర్, ఏసీపీ వెంకట్ రెడ్డి, డీఆర్​డీవో నాగిరెడ్డి, డీపీవో   సునంద పాల్గొన్నారు. 

లైసెన్స్‌‌‌‌డ్ ఆయుధాలు అప్పజెప్పండి

హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి, వెలుగు:  సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌‌‌‌లో ఆర్డీవోలు జగదీశ్వర్ రెడ్డి‌‌‌‌‌‌‌‌, ఏఎస్పీ నాగేశ్వరరావు,  కోదాడలో ఆర్డీవో సూర్యానారాయణ,  డీఎస్పీ ప్రకాశ్‌‌‌‌, తుంగతుర్తిలో డీఎసపీ నాగభూషనం ఆధ్వర్యంలో మీటింగ్‌‌‌‌ పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.  కోడ్ అమల్లో ఉన్నందున లైసెన్స్‌‌‌‌డ్ ఆయుధాలు పోలీసులకు అప్పగించి రశీదు పొందాలని సూచించారు.  50 వేల రూపాయలకు మించి  డబ్బులు  క్యారీ చేయవద్దని , బంగారం లాంటి విలువైన వస్తువులు తీసుకెళ్లాల్సి వస్తే సంబంధిత పత్రాలు వెంట తెచ్చుకోవాలన్నారు.   ఓటర్లను ప్రలోభ పెడితే   సి–-విజిల్ యాప్‌‌‌‌తో పాటు  1950 , 100  నెంబర్లకు కాల్‌‌‌‌ ఫిర్యాదు చేయాలని సూచించారు.