
- కమీషన్‌గా రూ.5 కోట్ల ఆదాయం పొందేలా ప్లాన్
- స్కూల్ యూనిఫారాల స్టిచ్చింగ్‌తో ఏటా రూ.కోటి 40 లక్షల ఇన్కమ్
- రూ.6 కోట్ల విలువ గల సోలార్ ప్లాంట్ ఏర్పాటు
- పెట్రోల్ బంక్ కోసం సిటీలో ల్యాండ్ వెతుకులాట
- పలు వ్యాపారాల్లో 12,500 మంది మహిళలు బిజీ
- రూ.200 కోట్ల టర్నోవర్‌తో స్త్రీనిధిలో స్టేట్‌లో టాప్
నిజామాబాద్, వెలుగు : మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధిపై జిల్లా యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సర్కారు ఉద్దేశాలకు అనుగుణంగా బ్యాంకర్ల నుంచి రూ.1,250 కోట్ల రుణాలు ఇవ్వగా, మహిళలు ఇదివరకే పలు వ్యాపారాలు ప్రారంభించారు. కొత్త ఆలోచనలతో భారీ ప్రాజెక్టులు అప్పగించి కోటీశ్వరులను చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తాజాగా యాసంగి సీజన్ వడ్లు కొనుగోలు చేసే బాధ్యతను 200 స్వయం సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా రూ.5 కోట్ల ఆదాయం పొందే అవకాశం ఉంది. 110 సంఘాలను ఇప్పటికే సెలెక్ట్ చేశారు. స్త్రీనిధి ద్వారా ఏటా తమ సభ్యులకు రూ.200 కోట్ల లోన్లు మంజూరు చేసి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
ఇక వడ్ల కొనుగోలులో ధీటుగా..
యాసంగి సీజన్లో రైతులు రికార్డు స్థాయిలో 4.19 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా కోతలు మొదలయ్యాయి. 11.85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి అంచనా వేస్తున్న అధికారులు అందులో 9 లక్షల టన్నుల కొనుగోలు చేయడానికి 664 సెంటర్లు ప్రారంభించనున్నారు. సింగిల్ విండోలకు 481, ఐకేపీ 107, ఐడీసీఎంఎస్‌కు 68, మెప్మాకు 8 కొనుగోలు సెంటర్లు అలాట్ చేశారు. అవసరాన్ని బట్టి మరిన్ని సెంటర్లు పెంచనున్నారు.
ఇప్పుడున్న 664 కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలకు 200 సెంటర్లు ఇవ్వాలని నిర్ణయించి తక్షణం110 సెంటర్లను ఓకే చేసేశారు. మరో 90 సెంటర్ల ఎంపికకు కసరత్తు నడుస్తున్నది. గతంలో ఈ సంఖ్య సుమారు 40 వరకే ఉండేది. 'ఏ’ గ్రేడ్ క్వింటాల్ వడ్లు కొనుగోలు చేసిన సెంటర్లకు కమీషన్‌గా రూ.32, కామన్ వెరైటీ వడ్ల కొనుగోలుకు రూ.31.25 పైసలు గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఈ లెక్కన సెంటర్ల నిర్వాహకులకు రూ.29 కోట్ల ఆదాయం రానుండగా, మహిళా సంఘాలకు రూ.5 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది.
స్కూల్ యూనిఫారాల స్టిచ్చింగ్..
జిల్లాలో 23,976 స్వయం సహాయ సంఘాలు ఉండగా, అందులో 2.35 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారికి ఈ ఏడు రూ.1,250 కోట్ల రుణాలను బ్యాంక్ లింకేజీ కింద ఇప్పించారు. 12,500 మంది మహిళలకు కిరాణా, క్లాత్, జనరల్ స్టోర్, బ్యూటీ పార్లర్, కోళ్ల పెంపకం తదితర వ్యాపారాలు చేసుకునేందుకు లోన్ ఇచ్చారు. గత ఏడాది నుంచి స్కూల్ పిల్లల యూనిఫారాల స్టిచ్చింగ్‌తో రూ.కోటి 40 లక్షల ఆదాయాన్ని సంఘాలు పొందుతున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి స్టిచ్చింగ్ పనులు ఏప్రిల్ నుంచి స్టార్ట్ కానున్నాయి. ఎడపల్లి మండలం జాన్కంపేటలో రూ.6 కోట్ల విలువగల 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్ మంజూరైంది. ఇందూర్ నగరంలో మహిళా సంఘానికి పెట్రోల్ బంక్ కోసం పది గుంటల గవర్నమెంట్ ల్యాండ్ ఆఫీసర్లు వెతుకుతున్నారు.
లేకుంటే ప్రైవేట్ భూమిని లీజుపై తీసుకోవడానికి రెడీ అయ్యారు. కలెక్టరేట్‌తో పాటు ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫారంలో సంఘాల ఆధ్వర్యంలో రెండు క్యాంటీన్లు గ్రౌండ్ అయ్యాయి. మరో మూడు ఓపెన్ చేయడానికి స్థలాలు వెదుకుతున్నారు. గ్రామ సమాఖ్యలు 806 ఉండగా, వారిలో చదువుకున్న మహిళలు కొందరికి మీ-సేవ సెంటర్ల నిర్వహణ అప్పగించాలని ప్లాన్ చేస్తున్నారు. బ్యాంక్‌ను పోలిన రీతిలో స్త్రీ నిధి ఏర్పాటు చేసుకొని రూ.200 టర్నోవర్‌తో జిల్లా రాష్ట్రంలో టాప్‌లో ఉంది. నగరంలో మహిళా సమాఖ్య కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం సర్కారు రూ.5 కోట్లు మంజూరు చేయగా పనులు షురూ అయ్యాయి. అన్ని హంగులతో కార్పొరేట్ ఆఫీస్‌ను తలపించేలా బిల్డింగ్ ఏర్పాటు కాబోతున్నది.