అన్నదాతలకు దన్నుగా.. పంటల రక్షణకు మండలాల వారీగా కమిటీలు

అన్నదాతలకు దన్నుగా.. పంటల రక్షణకు మండలాల వారీగా కమిటీలు
  • వరుస తడులపై రైతులకు అవగాహన 
  • నీళ్లున్న బోర్ల నుంచి పక్క పొలాలకు నీళ్లిచ్చేలా చర్చలు
  • అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్న అధికారులు
  • ఇప్పటికే 200 ఎకరాలు  కంప్లీట్ గా ఎండినట్లు రిపోర్టు

కామారెడ్డి, వెలుగు : భూగర్భ జలాలు అడుగంటడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడంతో సాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఎండుతున్న పంటల వివరాల సేకరణ, పంటల రక్షణ కోసం జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మండలాల వారీగా అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలను వివరిస్తున్నారు. పక్క బోర్లలో నీళ్లు ఉంటే ఆ బోరు యజమానితో మాట్లాడి పక్క పొలాలకు తడులను అందించే ప్రయత్నం చేస్తూ రైతులకు ఊరట కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. యాసంగి సీజన్​లో 3 లక్షల 97 వేల ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. ప్రధానంగా 2 లక్షల 61 వేల ఎకరాల్లో వరి సాగైంది. 

ఇందులో బోర్ల కింద 2 లక్షల ఎకరాలు ఉన్నాయి. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండడంతో బోర్లల్లో నీటి ధారలు తగ్గుతున్నాయి. వరి పంట పొట్ట దశలో ఉండడంతో వరుస తడులు అందించి రక్షించుకునేలా కమిటీలు సూచనలిస్తున్నాయి. మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, కామారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, లింగంపేట, పిట్లం, నాగిరెడ్డిపేట మండలాల్లో బోర్ల కింద వరి పంట ఎండుతోంది. లక్షలాది రూపాయలు అప్పులు చేసి బోర్లు వేయిస్తున్నారు.  మాచారెడ్డి మండలంలో వెయ్యి ఫీట్ల లోతు తవ్వినా నీటి జాడ లేదు.

కమిటీలు ఏమి చేస్తాయంటే ..

పంటల రక్షణకు ఏర్పాటు చేసిన కమిటీలో తహసీల్దార్, మండల అగ్రీకల్చర్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈలు ఉంటారు. పంటలను పరిశీలించి రైతులకు సూచనలు చేస్తారు. అప్పులు చేసి బోర్లు వేయకుండా అవగాహన కల్పిస్తారు. బోర్లల్లో నీటిని ఎలా వినియోగించుకోవాలి.. ఎన్ని రోజులకోసారి తడులు అందించాలో తెలియజేస్తారు. పక్క బోర్ల రైతులతో మాట్లాడి నీళ్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుతారు. 

నీటి ఎద్దడి గుర్తింపు..

పలు మండలాల్లో సాగునీటి ఎద్దడిని అధికారులు గుర్తించారు. 1050 ఎకరాల  వరి పంట ఎండే పరిస్థతి ఉందని వ్యవసాయ శాఖ  అధికారులు ఉన్నతాధికారులకు రిపోర్టు పంపారు. 200 ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంట దెబ్బతిన్నట్లు పేర్కొంటున్నారు. దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి,  మాచారెడ్డి, రామారెడ్డి, బీబీపేట మండలాల్లో బోర్ల కింద నీటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు గుర్తించారు.

రైతులకు సూచనలు చేస్తున్నాం 

పంటలను ఎలా కాపాడుకోవాలో రైతులకు సూచనలు చేస్తున్నాం. ప్రాజెక్టుల కింద ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్ల కింద పంటలు ఎండుతున్నాయి. మండల స్థాయిలో కమిటీలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తున్నాయి. బోర్లలో నీళ్లు ఎక్కువుంటే పక్క రైతుకు ఇప్పించేలా  ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులు పూర్తిస్థాయిలో నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నాం.

‌‌‌‌‌‌‌‌‌‌తిరుమల ప్రసాద్, జిల్లా అగ్రీకల్చర్ అధికారి