- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ
- అత్యధికంగా జగిత్యాలలో 3.15 లక్షల ఎకరాలు, కరీంనగర్ లో 3.04 లక్షలు
- పెద్దపల్లి జిల్లాలో 2.04లక్షలు, రాజన్నసిరిసిల్లలో 1.57లక్షలు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాసంగి పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని పంటలు కలిపి మొత్తం 9.82 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసింది. ఇందులో కరీంనగర్ జిల్లాలో 3,04,655 ఎకరాలు, జగిత్యాలలో 3,15,620 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 2,04,433 ఎకరాలు, సిరిసిల్ల జిల్లాలో 1,57,471 ఎకరాల్లో పంటలు సాగవుతాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. అంతేగాక రైతులు 90 నుంచి 95 శాతం వరకు వరి పంట సాగు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. సాగు అంచనాలకు అనుగుణంగా విత్తనాలు, ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
సాగులో వరి పంటే టాప్
వరి కోతలు పూర్తయిన ఉమ్మడి జిల్లాలో వరి కోతలు పూర్తికాగా.. రైతులు వరి నార్లు పోస్తున్నారు. యాసంగిలో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి ఎక్కువగా దొడ్డు రకం సాగుకే రైతులు మొగ్గు చూపే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో జిల్లాలో 90 శాతం మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 3,04,655 ఎకరాల సాగు లక్ష్యంలో 2.65 లక్షల ఎకరాలు వరి పంటే ఉంది. జగిత్యాల జిల్లాలో సాగయ్యే 3.15 లక్షల ఎకరాల్లో 2.68 లక్షల ఎకరాలు వరి సాగవుతుందని అంచనా వేశారు.
పెద్దపల్లి జిల్లాలో 2.04 లక్షల ఎకరాలకు గానూ 1.91 లక్షలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.57 లక్షల ఎకరాలకు గానూ 1.53 లక్షలు వరి సాగు కానుందని అంచనా వేశారు. కరీంనగర్ జిల్లాలో ఈసారి ఆరు తడి పంటల విస్తీర్ణం కొద్దిగా పెరిగే అవకాశముందని అగ్రికల్చర్ ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇందులో పల్లి 500 ఎకరాలు, పొగాకు 500 ఎకరాలు, పొద్దు తిరుగుడు 380, పెసర 80, నువ్వులు 60, జొన్న, శనగలు, అనుములు 50 ఎకరాల చొప్పున, పత్తి 20 ఎకరాలు, కందులు 10, మినుములు 5 ఎకరాల్లో సాగవుతుందని భావిస్తున్నారు. ఇతర పంటలు మరో 1200 ఎకరాల్లో సాగవుతుందని
అంచనా వేశారు.
రిజర్వాయర్లు, చెరువులు ఫుల్..
ఉమ్మడి జిల్లా రైతులకు సాగునీరందించే ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. సాగునీరు పుష్కలంగా ఉండటంతో ఉమ్మడి జిల్లాలో ఈ యాసంగిలోనూ వరి ఎక్కువగా సాగయ్యే అవకాశముంది. అంతేగాక కరీంనగర్ జిల్లాలో గత వర్షాకాలంలో సాధారణంకన్నా 17 శాతం అధిక వర్షం కురవడంతో భూగర్భ జలాలు 4.26 మీటర్లకు పెరిగాయి.
జగిత్యాల జిల్లాలో 20 శాతం అధిక వర్షం కురిసినందున 2.88 మీటర్లకు, పెద్దపల్లి జిల్లాలో 11 శాతం ఎక్కువ వర్షపాతంతో 4.15 మీటర్లకు, రాజన్న జిల్లాలో 29 శాతం అధిక వర్షపాతంతో 5.83 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. దీంతో వ్యవసాయ బావులు, బోర్ల కింద సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.