ప్రజా సమస్యల్ని పరిష్కరించండి : కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రజా సమస్యల్ని పరిష్కరించండి : కలెక్టర్ అభిలాష అభినవ్
  • ఆయా జిల్లాల్లో కొనసాగిన ప్రజావాణి పాల్గొన్న కలెక్టర్లు

నిర్మల్, వెలుగు:  ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి  కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు.  రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్, రైతు రుణమాఫీ వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పిం చారు.

 నిర్మల్ జిల్లాలో కొయ్య బొమ్మల తయారీకి పొనికి వనాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు డీఆర్డీఓ విజయలక్ష్మీని కలెక్టర్ అభినందించారు.  అన్ని ఆఫీసుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌‌ కుమార్, ఆర్డీఓ  రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


ఆసిఫాబాద్ , వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు.  సోమవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

 రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య తాను పుట్టుకతో దివ్యాంగుడిని అని ప్రస్తుతం చిన్న ఇంటిలో నివసిస్తున్నందున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ దరఖాస్తులను కలెక్టర్ కు అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.