మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ దివాకర టీఎస్

మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ దివాకర టీఎస్

తాడ్వాయి, వెలుగు: ఈ నెల 12 నుంచి 15 వరకు  జరగనున్న   సమ్మక్క, సారలమ్మ, వనదేవతల  మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్  తెలిపారు. గురువారం  మేడారం లో పలు శాఖల అధికారులతో కలిసి వైద్య శిబిరం ఏర్పాటు, జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను, మహిళల కోసం ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. అనంతరం గద్దెల ప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై  అధికారులతో మాట్లాడారు.   జాతరకు 10  నుంచి 20 లక్షల మంది భక్తులు  వచ్చే అవకాశం ఉండడంతో  దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు.  జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా,  వైద్య సిబ్బంది 24 గంటల పాటు  అందుబాటులో ఉంటారని  తెలిపారు.  

జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలను  నిరంతరం శుభ్రం ఉంచాలని  డీపీఓ  దేవరాజ్ ను ఆదేశించారు.  భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు,  కాళ్లు కాలకుండా  మ్యాట్లను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేశామన్నారు.  నాలుగు రోజుల పాటు   హనుమకొండ జిల్లా కేంద్రం నుంచి  నిరంతరం బస్సులను   నడిపించనున్నారని, జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు.  కార్యక్రమంలో డీఎస్పీ  రవీందర్,  డీఎం అండ్ హెచ్ ఓ గోపాల్ రావు, ఇరిగేషన్ ఈ ఈ నారాయణ, విద్యుత్ శాఖ డీఈ. పులుసం నాగేశ్వరరావు,పస్రా సీఐ రవీందర్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.