- ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
- ఎలాంటి పర్మిషన్ లేకుండా విధులకు ఎనిమిది మంది గైర్హాజరు, ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆదేశాలు
హాలియా, వెలుగు: అనధికారికంగా విధులకు గైర్హాజరైన నల్గొండ జిల్లా, గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఎనిమిది మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆమె గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మొత్తం ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన విషయాన్ని గమనించారు.
ఆగ్రహించిన కలెక్టర్ కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న ఫార్మాసిస్టు శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మాధవి, అటెండర్ శ్రీనివాస్, అటెండర్, అరుణ జ్యోతి, అటెండర్ ఎల్లమ్మలను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. రెగ్యులర్ ఉద్యోగులు అటెండర్ లక్ష్మీనారాయణ, ఫార్మసిస్ట్ భాగ్యమ్మ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం హెల్త్ అధికారి హరిలాల్ మాత్రం ఉప నియామకంపై ఇతర చోట పని చేస్తున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ప్రతి ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం , వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని గాలికి వదిలేసి సిబ్బంది మొత్తం గైర్హాజరు కావడం బాధాకరమన్నారు. విధులకు గైర్హాజరైన అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం, విధుల నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పారు.