ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి స్పీడ్ గా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హల్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్. పి. శ్రీజ తో కలిసి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఆయా దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, వరద బాధితుల నష్ట పరిహారం, ఉచిత విద్యుత్ బిల్లులు రావడం లేదనే పలు వినతులు వచ్చినట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ ఏవో అరుణ, అధికారులు, పాల్గొన్నారు.
సర్వే బృందాల పనితీరును తనిఖీ ..
ఖమ్మం టౌన్,వెలుగు : అర్హులందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం కలెక్టర్, స్థానిక 11వ డివిజన్ కవిరాజ్ నగర్, ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామంలో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు కోసం సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న తీరును కలెక్టర్ తనిఖీ చేశారు.
సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ పరిశీలించారు. తప్పిదాలకు తావు లేకుండా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ తనిఖీల సందర్భంగా ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, అదనపు డిఆర్డీవో నూరొద్దీన్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, వార్డ్ ఆఫీసర్ అర్చన ఉన్నారు.