వికారాబాద్, వెలుగు : రైతులు దేవుడితో సమానమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. మంగళవారం నవాబుపేటలోని పీఏసీఎస్ భవనంలో రైతు భరోసా పథకం పై రైతుల వద్ద సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఏయే పంటలను ఎక్కువగా పండిస్తారని, ఎదురయ్యే సమస్యలపైనా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకోవడానికి సందర్శిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేరాలనే సదుద్దేశంతోనే అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు.
కూరగాయ పంటలు పండిస్తున్న రైతుల రవాణా సౌకర్యం లేక సమయానికి మార్కెట్ కు తరలించలేక పోతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నవాబుపేట్ మండలాన్ని వెజిటేబుల్ జోన్ గా ప్రకటించాలని రైతులు కోరారు. పండించిన పంటలను మార్కెట్ కు తరలించేందుకు వీలుగా రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పీఏసీఎస్ చైర్మన్ పోలీస్ రాంరెడ్డి, జిల్లా సహకార అధికారి ఈశ్వరయ్య, తహశీల్దార్ జయరాం నాయక్, ఎంపీడీవో అనురాధ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.