స్టూడెంట్స్​కు నాణ్యమైన భోజనం పెట్టాలి : రాహుల్ ​రాజ్

స్టూడెంట్స్​కు నాణ్యమైన భోజనం పెట్టాలి : రాహుల్ ​రాజ్
  • కలెక్టర్లు ​రాహుల్ ​రాజ్, మనుచౌదరి​

మెదక్​ టౌన్, వెలుగు: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో స్టూడెంట్స్​కు నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అధికారులకు సూచించారు. శనివారం మెదక్​కలెక్టరేట్​లో అన్ని సంక్షేమ వసతి గృహాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాలకు సరఫరా అవుతున్న బియ్యం, సరుకుల నాణ్యతను పరిశీలించాలని, ముడి సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్స్​శుభ్రంగా ఉంచాలని, వంట పాత్రలు క్లీనింగ్​విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

ఎప్పటికప్పుడు ఆర్​వోఆర్​ప్లాంట్ల పనితీరును పరిశీలించి సురక్షిత తాగునీరు అందించాలన్నారు. వచ్చే మంగళ, బుధవారాల్లో వంట చేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. తాజా కూరగాయలతో నాణ్యమైన భోజనం తయారు చేసి స్టూడెంట్స్​కు వడ్డించే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం ఫుడ్ విత్ చిల్డ్రన్ కార్యక్రమం నిర్వహించి స్టూడెంట్స్​తో కలిసి భోజనం చేస్తూ ఆహార నాణ్యతను పరిశీలించాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్​నగేశ్, డీఎంహెచ్​వో శ్రీరామ్, డీఈవో రాధాకిషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ, మైనారిటీ అధికారులు శశికళ, నీలి, నాగరాజుగౌడ్, జెమ్లానాయక్​ పాల్గొన్నారు.

భవన నిర్మాణానికి నిధులు మంజూరు..

మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పట్టణ సమీపంలోని ధ్యాన్​చంద్​చౌరస్తా ఐటీఐ కాలేజీ వెనుక భాగంలో బిల్డింగ్​నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే పైలెట్ ప్రాజెక్టు కింద మెదక్ జిల్లా ఎంపికైనట్లు కలెక్టర్ తెలిపారు. హవేలీ ఘన్​పూర్​ మండలం లింగ్సాన్​పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సొంత స్థలం ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు తొలిదశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. 

రుచికరమైన భోజనాన్ని పెట్టాలి..

సిద్దిపేట రూరల్: జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలు,  గురుకులాలు, ప్రభుత్వ దవాఖనాల్లో నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని పెట్టాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో ఆయన అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లాలోని విద్యా, సోషల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సివిల్ సప్లె, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆహారం  క్వాలిటీ తగ్గకూడదని, దీని కోసం డిస్ట్రిక్ లెవల్ ఫుడ్ సేఫ్టీ కమిటీ వేస్తున్నట్లు ఈ కమిటీ అడిషనల్​ కలెక్టర్ ఆధీనంలో పని చేస్తుందని తెలిపారు. బియ్యం, పప్పులు, నూనెలు, ఇతర వంట సరుకులు అన్ని నాణ్యమైనవి తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఆహారం బాగాలేదని, పిల్లలు  అస్వస్థతకు గురయ్యారని, కంప్లైంట్​వస్తే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.