ఆదిలాబాద్, వెలుగు: దేశ రక్షణలో వైమానిక దళ సేవలు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 92 వార్షికోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని సైనిక్ వెల్ఫేర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన వేడుకల్లో కలెక్టర్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, రెండో బెటాలియన్ కమాండెంట్ నితిక పంత్ హాజరై కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐఏఎఫ్ స్థాపనను స్మరించుకుంటూ, దేశం గగనతలాన్ని నిరంతరం రక్షించే వీర వైమానిక యోధులను సత్కరిస్తూ ఏటా అక్టోబర్8 న ఎయిర్ ఫోర్స్ డే నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. భారత దేశ వైమానిక దళం ప్రపంచంలోని ఎయిర్ ఫోర్సుల్లో మూడో స్థానంలో ఉందని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు.