మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేయాలి  : జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
  • జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు: నారాయణపేటలో నిర్మిస్తున్న నూతన మెడికల్ కళాశాల ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం మెడికల్ కాలేజీ మీటింగ్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 32 ఎకరాల స్థలంలో నిర్మించిన మెడికల్ కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని, ఇంటర్నల్ రోడ్లు, ప్రధాన రహదారి నుంచి కళాశాల వరకు రోడ్డును వేయాలని టీజీఎంఐ డిసి అధికారులకు సూచించారు.

 ఇటీవలే జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాలను పరిశీలించిన టీజీఎమ్ఐ డిసి చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్ మెడికల్ కళాశాల గ్రౌండ్ ఫ్లోర్ లో ఎంసీహెచ్ (మదర్ అండ్ చైల్డ్ హెల్త్) విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించిన విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాంకిషన్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ స్టేట్ హెల్త్ డైరెక్టర్ ఆదేశాలను పాటించాలన్నారు.  

గ్రౌండ్ ఫ్లోర్ లో  ఎంసి హెచ్ విభాగానికి అవసరమైన అన్ని పరికరాలను సమకూర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  కళాశాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూలు ఖరారు కాకముందే పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని  ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, ట్రాన్స్ కో ఎస్ ఈ ప్రభాకర్, ఆర్ అండ్ బీడీ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.