- రేపటి నుంచి నవంబర్ 10 వరకు స్వీకరణ
- ఆర్వో ఆఫీస్‌లను పరిశీలించిన కలెక్టర్లు
- పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం
- నామినేషన్లపై లీడర్లకు అవగాహన
చొప్పదండి/ తిమ్మాపూర్/ కరీంనగర్ టౌన్ / జ్యోతినగర్,వెలుగు: నవంబర్ 3 నుంచి నవంబర్ 10 వరకు రిటర్నింగ్ అధికారి ఆఫీస్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఆయా జిల్లాలోని ఆర్వో ఆఫీస్‌లను కలెక్టర్లు బుధవారం పరిశీలించారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, తిమ్మాపూర్‌లో కలెక్టర్ పమేలా సత్పతి పర్యటించారు. కలెక్టరేట్ లో నామినేషన్ల స్వీకరణ మాక్ ట్రైనింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నామినేషన్ల స్వీకరణ విధుల్లో పాల్గొనే సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించే సమయంలో ఓటర్ లిస్టు, ఖచ్చిత సమయాన్ని తెలిపే వాల్ క్లాక్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు చొప్పదండి నియోజక వర్గ రిటర్నింగ్ ఆఫీసు, ఆర్నకొండ వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లను పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు ఆర్వో ఆఫీసు వద్ద 100 మీటర్ల వరకు మార్కింగ్ చేయాలని, నామినేషన్ వేయడానికి ఆర్వో ఆఫీసులో అభ్యర్థితో కలిపి 5గురిని మాత్రమే అనుమతించాలని తెలిపారు.
నామినేషన్ ప్రక్రియ మొత్తం రికార్డ్ చేయాలని తెలిపారు. చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు, చెకింగ్ విధానం, పట్టుబడిన తరువాత చేపట్టే చర్యలను గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్వో ప్రఫుల్ దేశాయ్, తహసీల్దార్ జక్కని నరేందర్, సీఐ రవీందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దపల్లిలో..
జిల్లాలోని ఎన్టీపీసీ జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ ఆఫీన్ను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. నామినేషన్ ఫారం అఫిడవిట్ లో ప్రతి కాలమ్ తప్పనిసరిగా నింపాలని సూచించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించి, నామినేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు నామినేషన్ కి వచ్చే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ర్యాలీలు చేయడానికి వీలు లేదని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ పత్రాలు పరిశీలించి, పెండింగ్ డాక్యుమెంట్లు ఏమైన ఉంటే వివరాలు తెలియజేస్తారని చెప్పారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీపీ
కరీంనగర్ క్రైం: నగరంలోని పోలింగ్ కేంద్రాలను సీపీ అభిషేక్ మహంతి సందర్శించారు. టౌన్ ఏసీపీ కార్యాలయం, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియ , సభలు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతులపై ఆరా తీశారు. నామినేషన్ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిర్వహించాల్సిన విధుల పట్ల తగు సూచనలు చేశారు. ఆయనతోపాటు కరీంనగర్ టౌన్ డివిజన్ ఏసీపీ నరేందర్, టూ టౌన్ సీఐ రాంచందర్ రావు పాల్గొన్నారు.