
- మండలాల వారీగా మహిళలకు స్టిచ్చింగ్ బాధ్యత
- 6, 7 క్లాస్ బాయ్స్‌కు నిక్కర్లకు బదులు ప్యాంట్లు
- నిజామాబాద్ జిల్లాలో 1.11 లక్షల మంది విద్యార్థులు
- 4.89 లక్షల మీటర్ల క్లాత్‌కు ఇండెంట్
నిజామాబాద్, వెలుగు : సర్కారు బడుల విద్యార్థులకు కొలతలతో కూడిన యూనిఫారాలను అందజేసేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. వేసవి సెలవుల తరువాత స్కూల్ రీఓపెన్ కాగానే ఒక జత యూనిఫామ్ అందించేలా మెప్మా, సెర్ఫ్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది మహిళా సంఘాలకు ఆలస్యంగా స్టిచ్చింగ్ బాధ్యత అప్పజెప్పడం వల్ల తలెత్తిన లోపాలను సరిదిద్దే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం విద్యార్థుల కొలతలు తీసుకుని, 2025–26 విద్యా సంవత్సరానికి యూనిఫారాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆరుగురు మాస్టర్ ట్రైనర్లతో ఈ నెలలో 28 మండలాల మహిళా సమాఖ్యలకు స్టిచ్చింగ్‌పై శిక్షణ ఇచ్చారు.
యూడైస్ లెక్కల ఆధారంగా స్టూడెంట్స్ సంఖ్య కన్పర్మ్
జిల్లాలో 693 ప్రైమరీ, 116 అప్పర్ ప్రైమరీ, 230 హైస్కుల్స్, 25 కేజీబీవీ, 10 ఆదర్శ తదితర పాఠశాలలు కలిపి మొత్తం 1,074 బడులు ఉన్నాయి. 1.11 లక్షల మంది విద్యార్థులు ఉండగా, 60,355 బాయ్స్, 51,906 గర్ల్స్ ఉన్నారు. ఏటా 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ప్రభుత్వం రెండు జతల యూనిఫారాలు ఇస్తుంది. మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో గతేడాది స్టిచ్చింగ్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. జూన్ 6న స్కూల్స్ప్రారంభం కాగా, మే నెల ఆఖరు వారంలో యూనిఫాం క్లాత్ మహిళా సంఘాలకు చేరింది. దీంతో హడావుడి స్టిచ్చింగ్ చేసి ఇవ్వడంతో క్లాత్ వేస్ట్ కాగా, లోడాసు నెక్కర్లు, బిర్రు అంగీలు వేసుకోలేక సివిల్ డ్రెస్‌లతో విద్యార్థులు స్కూళ్లకు హాజరవుతున్నారు.
ఈ సారి లోపాలను సరిచేసేందుకు రెండు జతల యూనిఫారాల కోసం 4.89 లక్షల మీటర్ల క్లాత్ అవసరమని ఇండెంట్ పెట్టారు. ఈనెల 10వ తేదీలోపు జిల్లాకు క్లాత్ చేరగా, ప్రతి విద్యార్థి కొలతలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 28 మండలాల్లో మహిళా సమాఖ్యలు ఉండగా, మెప్మా, సెర్ఫ్ ఆధ్వర్యంలో స్టిచ్చింగ్ పూర్తి చేసేలా శిక్షణ ఇచ్చారు. 3,604 మహిళా సంఘాలు జూన్ నెలలో ఒక జత, ఆ తర్వాత మరో జత యూనిఫామ్ కుట్టి ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు.
నో డిజైన్ యూనిఫారాలు..
డిజైన్లు లేకుండా సాదాసీదాగా యూనిఫారాల రెడీ చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు షర్ట్, నెక్కర్లు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు షర్ట్, ప్యాంట్లు, 1 నుంచి -3 తరగతి విద్యార్థినులకు బాడీ ఫ్రాక్, షర్ట్, 4- నుంచి 5వ క్లాస్ గర్ల్స్‌కు షర్ట్, స్కర్ట్, 6 నుంచి 12 తరగతుల అమ్మాయిలకు పంజాబీ డ్రెస్ విత్ వాస్కోట్ పంపిణీ చేయనున్నారు. ఎంఈవోల పర్యవేక్షణలో ప్రతి స్కూల్‌కు డ్రెస్‌లు చేరాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి డ్రెస్ స్టిచ్చింగ్కు రూ.75 లను ప్రభుత్వం చెల్లించనుంది.
జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
గతంలో తలెత్తిన లోపాలను సరిచేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కలెక్టర్ పర్యవేక్షణలో స్కూల్ యూనిఫారాలు రెడీ అవుతున్నాయి. స్టూడెంట్స్ కొలతల ప్రకారమే డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయిస్తున్నాం. స్టిచ్చింగ్‌లో మార్పులుంటే ఎవరైతే కుట్టారో వారితోనే సరి చేయిస్తాం.
శ్రీనివాస్‌రావు, డీఈవో ఆఫీస్ సీఎంవో
కొలతలు కంప్లీట్ చేస్తున్నాం
స్కూళ్ల వారీగా విద్యార్థుల కొలతలు సేకరిస్తున్నాం. గతేడాది మాదిరి కాకుండా ఈసారి పర్ఫెక్ట్ సైజులతో స్టిచ్చింగ్ చేయిస్తున్నాం. మండలాల వారీగా కుట్టు మిషన్లు, బల్క్ కట్టింగ్ యంత్రాలు రెడీ చేశాం. క్లాత్ రాగానే స్టిచ్చింగ్ మొదలుపెడతాం.
సాయిలు, డీపీఎం