పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేయాలి : సంజయ్ కుమార్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు :  పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు సంజయ్ కుమార్  మిశ్రా, వ్యయ  పరిశీలకుడు డాక్టర్  కుందన్ యాదవ్  ఆదేశించారు. బుధవారం ఆర్అండ్ బీ గెస్ట్​హౌస్​లో పోలింగ్  ఏర్పాట్లపై మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఆర్వోలతో రివ్యూ నిర్వహించారు. పోలింగ్ కు ముందు చేయాల్సిన  ఏర్పాట్లు, ఈవీఎం, వీవీ ప్యాట్ల భద్రత, జాగ్రత్తలపై నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు.

ఫిర్యాదులు, తీసుకున్న చర్యలు, పోలింగ్ సిబ్బంది, ఈవీఎంల తరలింపునకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఆర్వోలు అనిల్ కుమార్, ఎస్  మోహన్ రావు, ఎన్  నటరాజ్  పాల్గొన్నారు. ఓటు వేసేందుకు ఓటర్లు తమ వెంట ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దానిని వెంట తెచ్చుకోవాలని కలెక్టర్  జి .రవినాయక్  తెలిపారు.

ఎన్నికలపై నమ్మకాన్ని నిలబెట్టాలి

వనపర్తి :  ఎన్నికలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  కోరారు. వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్  కాలేజీలో పీవో, ఏపీవోలకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు కొత్త ఓటర్లతో తామ ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు.

మైక్రో అబ్జర్వర్లు నిబద్ధతతో పని చేయాలి

గద్వాల :  ఎన్నికల రోజు మైక్రో అబ్జర్వర్లు పకడ్బందీగా పని చేయాలని ఎన్నికల పరిశీలకుడు వసంత కుమార్  సూచించారు. కలెక్టరేట్  మీటింగ్ హాల్ లో బుధవారం మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి మాట్లాడారు. ఎన్నికల రోజున మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని, ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. మాక్ పోలింగ్ నిర్వహణలో 50 ఓట్లు వేశారా? లేదా అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. అడిషనల్  కలెక్టర్  శ్రీనివాస్  ఉన్నారు.

పోలింగ్​ కేంద్రాల్లో సౌలతులు కల్పించాలి

పెబ్బేరు :  జిల్లాలో ఏర్పాటు చేసి పోలింగ్​ కేంద్రాల్లో సౌలతులు కల్పించాలని ఎలక్షన్​ అబ్జర్వర్​ సోమేశ్​మిశ్రా సూచించారు. బుధవారం పెబ్బేరు మండలం, మున్సిపాలిటీలోని పోలింగ్​ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్​ కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు, కరెంట్, మరుగుదొడ్లు తదితర సౌలతులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో ప్రవీణ్​ కుమార్, మున్సిపల్​ కమిషనర్​ ఆది శేషు ఉన్నారు.

ALSO READ : కాంగ్రెస్​కు 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు: కేసీఆర్

బందోబస్తుపై ఫోకస్

నాగర్ కర్నూల్ టౌన్ :  పోలింగ్  రోజున కేంద్ర, రాష్ట్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్  వైభవ్  రఘునాథ్ తెలిపారు. బుధవారం మీటింగ్  హాల్​లో పోలీస్  అబ్జర్వర్  డాక్టర్ ఇలియాజ్ తో కలిసి ఎలక్షన్  సెల్  మెంబర్స్ తో రివ్యూ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్  సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ స్టేషన్ల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు.