
ప్రజల ఆరోగ్యం అంటే వ్యాపార సరుకు అన్నట్లుగా మారింది పరిస్థితి. పేరుకు ముందు డాక్టర్ అని చేర్చుకుంటే సరి.. డబ్బులు రాలుతాయి అన్న ధోరణిలో అక్రమంగా, అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నారు చాలా మంది. ఈ నకిలీ డాక్టర్లపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా ఝుళిపించింది. అధికారులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం (మార్చి 29) ఒక ఆస్పత్రిని సీజ్ చేయటమే కాకుండా ఐదుగురు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేశారు.
పలు ఆస్పత్రులపై దాడులు చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. గండిపేట్ మండలం మంచిరేవుల గ్రామంలో కొనసాగుతున్న ఆరోన్ అనే ప్రైవేట్ హాస్పిటల్ ను సీజ్ చేశారు. మార్చి 24న ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం చేసిన కేసులో నిందితురాలు, నకిలీ లేడీ డాక్టర్ ఏలియమ్మ సెబాస్టియన్ నడిపిస్తున్న ఆరోన్ ఆస్పత్రిని మూసివేయాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారులు హెచ్చరించినప్పటికీ యధేచ్ఛగా ఆస్పత్రిని నడిపిస్తున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆసుపత్రి పై దాడి చేసి సీజ్ చేశారు.
అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తనిఖీల్లో భాగంగా ఐదుగురు నకిలీ ఆర్ఎంపి డాక్టర్లను గుర్తించి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు అధికారులు. కానీ ఈ నకిలీ ఆర్ఎంపి డాక్టర్లపై కేసులు నమోదైనా యధావిధిగా క్లినిక్ లు కొనసాగిస్తున్నందున జిల్లా వైద్యాధికారులు 5 క్లినిక్ లను సీజ్ చేశారు. కొండాపూర్ లోని న్యూ హఫీజ్ పేట్ మార్తాండ నగర్ వెంకటేశ్వర క్లినిక్, కవిత ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ప్రేమ్ నగర్ బి బ్లాక్ లోని శ్రీ సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, గణేష్ మండపం వద్ద రెహమానియా క్లినిక్, మదీనగూడ ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న కిరణ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లను సీజ్ చేశారు.
సందర్భంగా డాక్టర్ బి. వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. ‘‘అరోన్ హాస్పిటల్ యాజమాన్యం ఆసుపత్రి పర్మిషన్ రెన్యువల్ కొరకు సమర్పించిన డాక్యుమెంట్లలో రెంటల్ అగ్రిమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ గా విచారణలో తేలింది. దీంతో ఆసుపత్రి సమర్పించిన రెంటల్ అగ్రిమెంట్ నకిలీదని బిల్డింగ్ యజమాని పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు నకిలీ లేడీ డాక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆసుపత్రికి ఉన్న అనుమతులను మార్చి 19వ తేదీన రద్దు చేశారు. కానీ రద్దు చేసిన అనంతరం అనుమతులు తిరిగి పొందేంతవరకు ఆసుపత్రిని మూసి ఉంచాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయినా ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆసుపత్రి యజమాన్యం యధావిధిగా కొనసాగిస్తుండడంతో సీజ్ చేశాము’’ అని చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు, అర్హతలు లేకుండా నకిలీ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి ఆసుపత్రులను, క్లినికులను కొనసాగిస్తే సహించేది లేదని.. అటువంటి ఆస్పత్రులను ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం- 2010 ప్రకారం సీజ్ చేస్తామని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.