స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మంత్రి సీతక్క

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మంత్రి సీతక్క
  • జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క

బాసర, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్​గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. గురువారం బాసరలోని ఆర్య వైశ్య సత్రంలో కార్యకర్తల ముఖ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రాబోవు స్థానిక, మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, పార్టీ ప్రతిష్ఠను కాపాడాలని సూచించారు. నాయకులు గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అంతకుముందు కేంద్రమంత్రి వేణుగోపాలా చారి మాట్లాడుతూ.. పల్లె స్థాయి నుంచి పట్టణం వరకు ప్రతి కార్యకర్త స్థానిక, మున్సిపల్, ఎమ్మెల్సీ, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని కోరారు. 

బాసర అమ్మవారి దర్శనం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని మంత్రి సీతక్క దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. ఫిబ్రవరి 3న జరగనున్న వసంత పంచమి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులకు అనుమతి ఇవ్వాలని ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ వినతిపత్రం అందజేశారు.

 ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, మాజీ సర్పంచ్ లు రమేశ్, లక్ష్మ ణ రావు, సుధాకర్ రెడ్డి, సంజీరావు  దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

పద్మశ్రీ గుస్సాడీ కనక రాజుకు నివాళి

జైనూర్: గతేడాది అక్టోబర్ 25న అనారోగ్యంతో మరణించిన గుస్సాడీ కళాకారుడు పద్మశ్రీ కనక రాజు కుటుంబాన్ని మంత్రి సీతక్క ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్​తో కలిసి పరామర్శించారు. గురువారం జైనూర్​లోని మర్లవాయి గ్రామాన్ని సందర్శించారు. కనక రాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబం జీవన స్థితిగతులపై అరా తీశారు. ఆదివాసీల గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి తెలియచేసిన కనక రాజు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. 

గ్రామంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీసీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, ఆసిఫాబాద్ డీసీసీ విశ్వప్రసాద్, కాంగ్రెస్​ నేత ఆత్రం సుగుణ, మండల ప్రెసిడెంట్ ముఖీద్,  మర్లవాయి మాజీ సర్పంచ్ కనక ప్రతిభ తదితరులున్నారు.